calender_icon.png 20 October, 2024 | 7:00 AM

ప్రకృతిని కాపాడుకొమ్మంటున్న సింబా

25-07-2024 12:05:00 AM

“ప్రపంచంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల 65 శాతం మంది చనిపోతున్నారు. అంటే దమ్ము, మందు కంటే.. దుమ్ము వలన చనిపోయేది పాతిక రెట్లు ఎక్కువ”, “వస్తువులైతే మనతో కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. కానీ మొక్కలు మనతోనే ఉంటాయి. మనతో పాటు పెరుగుతాయి. మన తరువాత కూడా ఉంటాయి” వంటి ఆసక్తికర సంభాషణలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చిత్రం ‘సింబా’. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ సినిమాలో అనసూయ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన కథతో మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అనసూయ మాట్లాడుతూ “వృక్షో రక్షతి రక్షితః అనేది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పర్యావరణాన్ని మనం ఎలా పాడు చేస్తున్నామో.. ఫలితంగా ఎలాంటి పర్యవసనాలను ఎదుర్కొంటున్నామో చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా మా సినిమా రాబోతోంది. జగపతి బాబు గారు ఈ చిత్రానికి ప్రధాన బలం. ఈ సినిమా ఒక్కరిలో మార్పు తెచ్చినా ప్రకృతిలో ఎంతో మార్పు వస్తుంది” అన్నారు. దర్శకుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ “నేను సంపత్ నంది గారితో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నాను. ఆయన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా ఆగస్ట్ 9న రాబోతోంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దాసరి రాజేందర్ రెడ్డి, నటులు వశిష్ట సింహా, కబీర్ సింగ్, దివితో పాటు కెమెరామెన్ కృష్ణ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్, మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ పాల్గొన్నారు.