calender_icon.png 1 January, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెండితెర సూపర్ స్టార్

23-12-2024 12:00:00 AM

ఏడు పదులు దాటినా.. అందానికి అందం అన్నట్టుగా అలరిస్తోన్న బాలీవుడ్ నటి బబిత శివదాసానీ కపూర్. బాల్యంలోనే నటనలో ఓనమాలు దిద్దారు. అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1960లో తాను చేసింది 19 చిత్రాలే కానీ బబితా అందాలతో విందు చేస్తూ జనం మదిలో చెరగని ముద్ర వేశారు. ఒక విధంగా బాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగారు బబితా శివదాసాని కపూర్. 

నటుడు హరి శివదాసాని, తల్లి బార్బరా శివదాసానికి 1947 ఏప్రిల్ 20న బొంబాయిలో బబితా శివదాసాని కపూర్ జన్మించారు. బబితా తండ్రి ఒక సింధీ కుటుంబానికి చెందినవారు. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి వలస వచ్చి బొంబాయిలో స్థిరపడ్డారు. బబితా తొలి చిత్రం సంజయ్ ఖాన్ సరసన ‘దస్ లఖ్’లో నటించారు.

తర్వాత రాజేశ్ ఖన్నాతో రొమాంటిక్ థ్రిల్లర్ ‘రాజ్’లో నటించారు. ఈ రెండు చిత్రాలు బబితాకు మంచి గుర్తింపు తెచ్చాయి. 1966 నుంచి 1973 వరకు ఆమె తీసిన సినిమాలు బాక్సాఫీస్ విజయాలను సాధించాయి. వాటిలో ‘ఫర్జ్’, ‘హసీనా మాన్ జాయేగీ, ‘కిస్మత్’, ‘ఏక్ శ్రీమాన్ ఏక్ శ్రీమతి’, ‘డోలీ’, ‘కబ్’ వంటి 19 చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.

‘క్యూన్? ఔర్ కహాన్’, ‘కల్ ఆజ్ ఔర్ కల్’, ‘బాన్‌ఫూల్’, ‘ఏక్ హసీనా దో దివానే’, ‘జీత్’ సినిమాల్లో కూడా నటించారు. అగ్రనటులైన జీతేంద్ర, రాజేశ్ ఖన్నా, షమ్మీ కపూర్, ధర్వేంద్ర, మనోజ్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్, భర్త రణధీర్ కపూర్ కూడా నటించారు. ‘తేనే మనసులు’ అనే తెలుగు రీమేక్ ‘డోలీ’ చిత్రంలో మళ్లీ రాజేశ్ ఖన్నాతో కలిసి నటించింది. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. 

కెరీర్‌లో ఒక మైలురాయి..

‘కల్ ఆజ్ ఔర్ కల్’ అనే చిత్రం బబితా కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయిం ది. ఇందులో ఆమెకు కాబోయే భర్త రణ్‌ధీర్ కపూర్, మామగారు రాజ్ కపూర్, తాతయ్య పృథ్వీరాజ్ కపూర్‌లతో ఆర్‌కే బ్యానర్‌లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రణ్‌ధీర్ కపూర్‌తో బబితా ప్రేమలో పడింది. ఈ సినిమా విడుదలైన తర్వాత రణ్‌ధీర్ ఇంట్లో వాళ్లను ఒప్పించి.. బబితాను పెళ్లి చేసుకున్నారు. అలా ఫ్యామిలీ లైఫ్ కోసం కెరీర్‌ను పూర్తిగా దూరం చేసుకున్నది బబితా. వీరికి కరిష్మా కపూర్, కరీనా కపూర్ జన్మించారు. ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా కొనసాగారు. 

ఎప్పటికీ స్నేహితులు..

ఏమైందో ఏమో కానీ 1988లో రణ్‌ధీర్, బబితా విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగానే నివసిస్తున్నారు. ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నప్పటికీ, వారి మధ్య ఎటువంటి చేదు అనుభవం లేదంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో రణ్‌ధీర్ కపూర్ మాట్లాడుతూ.. ‘బబితా ఇప్పటికీ నా భార్య. నేను ఆమెతో జీవించలేకపోతే, ఆమె నా భార్య కాదని కాదు. నేను తరచుగా ఆమెను కలుస్తుంటాను. మేం కలిసి బయటకు వెళ్తాం.. నేను, నా భార్య.. పిల్లల నుంచి విడిపోయిన దశను గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను ఇప్పటికీ బబితాను ప్రేమిస్తున్నా’. అని అన్నారు. 

35 ఏళ్ల తర్వాత..

బాలీవుడ్ దిగ్గజ నటుడు రణ్‌ధీర్ కపూర్, సీనియర్ నటి బబితా విడిపోయి 30 ఏళ్లకు పైనే అవుతోంది. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగానే నివసిస్తున్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. 2023లో భర్త కొత్తగా షిఫ్ట్ అయిన బాంద్రాలోని ఇంటికి తన సామానంతా సర్దేసుకుని మరీ వచ్చేసింది బబితా. ఎట్టకేలకు వీళ్లిద్దరూ ఒక్కటవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.