calender_icon.png 16 January, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెండితెర.. ధృవతార

28-10-2024 12:00:00 AM

పద్మిని.. పున్నమినాటి వెన్నెల.. లేడి పిల్లలాంటి కళ్లు.. హంసలాంటి నడక.. ఆమె అందానికి.. అభినయానికి ఫిదా అవ్వాల్సిందే! ‘నీదేగా నీదేగా.. తనువూ హృదయం నీదేగా’ అంటూ పాట రేడియోలో వచ్చిందంటే.. పద్మిని రూపమే ప్రతిబింబించేది. అప్పట్లో పద్మిని నృత్యానికి ప్రేక్షకులు మైస్మరైజ్ అయ్యేవాళ్లు. తొలితరం అగ్ర హీరోల సరసన మెరిసిన తార. 

పద్మిని 1932, జూన్ రెండున తిరువనంతపురంలో ఉన్నత భూస్వామ్య కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు శ్రీ తంకప్పన్ పిళ్లు, సరస్వతి. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వారిలో రెండో సంతానం పద్మిని. అక్కచెల్లెలి పేర్లు లలిత, రాగిణి, కొడుకు పేరు చంద్రకుమార్.  

వెండితెరను ఏలిన రాణులు..

అప్పట్లో ఈ ముగ్గురు అక్కచెల్లెలు వెండితెరను ఏలిన మహారాణులు. వారి లలిత, పద్మిని, రాగిణి.. వీళ్లనే ట్రావెన్‌కోర్ సిస్టర్స్‌గా ప్రసిద్ధి. ఈ ముగ్గురు సిస్టర్లు క్లాసికల్ డ్యాన్సర్లుగా, నటీనటులుగా చురుకైన పాత్ర పోషించారు. ట్రావెన్‌కోర్ సిస్టర్స్ అంటే ‘లక్స్ నుంచి ఎయిర్ ఇండియా’ వరకు అనేక పెద్ద పెద్ద యాడ్స్‌పై వీరి ముఖాలు కనిపించేవి.

వీరిలో ఇద్దరు క్యాన్సర్‌తో మరణించగా.. పద్మిని గుండెపోటు మరణించారు. ఒక విధంగా పద్మిని మరణంతో ట్రావెన్‌కోర్ సిస్టర్ల శకం ముగిసింది. వీరి మరణానికి చిహ్నంగా 2008లో భారత ప్రభుత్వ తపాలా శాఖ ముగ్గురు సోదరీమణుల కోసం ప్రత్యేక కవర్‌ను విడుదల చేసింది. 14 ఏళ్ల వయసులో బాలీవుడ్‌లో ‘కల్పన’ అనే మూవీలో డ్యాన్సర్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది.

ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు. ఈ మూవీ తర్వాత డ్యాన్సర్‌గా పద్మినికి ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. అలా కొద్దికాలంలోనే పద్మిని సౌత్ స్టార్‌గా ఎదిగింది. 1953లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఫిల్మ్ జర్నల్ ఫిల్మ్ ఫేర్ కవర్’పై పద్మిని ఫోటోను ప్రచురించింది.

తమిళం, హిందీ, మలయాళం, తెలుగు సినిమాల్లో.. సుమారు 250కి పైగా చిత్రాల్లో నటించింది. శివాజీగణేశన్, ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి.రామారావు, రాజ్‌కపూర్, షమ్మీకపూర్, ప్రేమ్ నజీర్, రాజ్‌కుమార్, జెమినీ గణేశన్ వంటి అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. ఎక్కువగా శివాజీ గణేశన్‌తో 57 సినిమాల్లో నటించింది. 

మూడు భాషల్లో.. 

తమిళంలో ‘ఎజై పదం పాడు’ పద్మినికి మొదటి చిత్రం. తమిళ్లో.. ‘సంపూర్ణ రామాయణం’, ‘తంగ పదుమై’, ‘అన్బు’, ‘థిల్లానా మోహనాంబాల్’, ‘శ్రీ వల్లి’, ‘తైక్కు ఒరు తాలట్టు’, ‘ఆయిరం కన్నుదయాల్’, ‘కుమార సంభవం’ వంటి పలు సినిమాల్లో నటించింది. అలాగే హిందీలో.. రాజ్ కపూర్ సరసన ‘మేరా నామ్ జోకర్’, ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’లో పద్మిని హీరోయిన్‌గా నటించింది.

‘ఆషిక్’, ‘అమర్‌దీప్’,‘పాయల్’, ‘అఫ్సానా’, ‘వాస్నా’, ‘చందా ఔర్ బిజిలీ’, ‘బాబూభాయ్ మిస్త్రీ’, ‘మహా భారత్’లో కూడా నటించింది. 1957లో ‘జర్నీ బియాండ్ త్రీ సీస్’ (హిందీః పరదేశి)లో నటించింది. రాజ్ కపూర్ తండ్రి పృథ్వీరాజ్‌కపూర్, పద్మిని కలిసి నటించిన పరదేశి మూవీ ఇండో ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఆమెకు గౌరవార్థంగా ఒక స్టాంప్‌ను విడుదల చేశారు. నర్తకిగా, నటిగా వైజయంతిమాలతో వృత్తిపరమైన పోటీ అప్పట్లో గట్టిగా ఉండేదని ఇండస్ట్రీలో పెద్ద టాక్ వినిపించేది. ఇక తెలుగులో.. 1953లో విడుదలైన ‘అమ్మలక్కలు’ సినిమాలో ఎన్.టి.రామారావు సరసన నటించింది.

‘గొప్పింటి అమ్మాయి’, ‘అనుమానం’, ‘ధర్మ దేవత’, ‘పెళ్లికూతురు’, ‘ఆడజన్మ, ‘బీదలపాట్లు’, ‘తిరుగుబాటు’ వంటి పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నది. 

పద్మిని ఫైన్ ఆర్ట్స్ స్కూల్..

1961లో రామచంద్రన్ అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకొని నటనకు ముగింపు పలికింది.. తర్వాత కుటుంబ జీవితంపై, భరతనాట్యంపై దృష్టిని కేంద్రీకరించింది. వీరికి 1963లో ప్రేమానంద్ జన్మించాడు. ప్రేమానంద్ ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్‌లో జర్నలిస్టుగా, ఫోటోగ్రాఫర్‌గా పని చేశారు.

1977లో న్యూ జెర్సీలో శాస్త్రీయ నృత్యశిక్షణ కోసం ‘పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ అనే పేరుతో ఒక డ్యాన్స్ స్కూల్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ స్కూల్ అమెరికాలోని భారత శాస్త్రీయ నృత్య శిక్షణా సంస్థలలో అతి పెద్దది కావడం విశేషం. పద్మిని 2006 సెప్టెంబరు 24న గుండెపోటుతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

పద్మిని మరణవార్త తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఇలా స్పందించారు “ఆమె నక్షత్రాల్లో ఒక నక్షత్రం. అందమైన, అరుదైన కళాకారిణిని మింగేయడానికి చావుకు హృదయం ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు” అన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం నుంచి వచ్చినవారే ప్రముఖ నటి శోభన, హీరో వినీత్.