‘ప్యార్ కియా తో డర్నా క్యా.. జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా..’ అంటూ అప్పట్లో వెండితెరపై అనార్కలిగా అందం, అభినయంతో మంత్రముగ్దులను చేసింది లెజెండరీ నటి మధుబాల. రెండు దశాబ్దాలు.. 60కి పైగా సినిమాల్లో నటించారు. మధుబాల కెరీర్‌లో ‘మొఘల్ ఎ ఆజమ్’ చిత్రం మైలురాయిగా చెప్పొచ్చు.
అనార్కలిగా ఆమె పలికించిన అభినయం ఇన్నేళ్లయినా ప్రేక్షకులు మరిచిపోలేదు. ఆ ఏడాది ఉత్తమ హిందీ సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. ఇప్పటికీ మధుబాల ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొకొచ్చేది అనార్కలి పాత్రే.
బాలీవుడ్‌లోతొలితరం ప్రసిద్ధ నటుల జాబితా తయారుచేస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు మధుబాల. మధుబాల అసలు పేరు ముంతాజ్ జహాన్ బేగం దేహ్లావి. 1942లో ‘బసంత్’ అనే సినిమా ద్వారా బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. 1947లో వచ్చిన ‘నీల్ కమల్’ చిత్రంలో రాజ్ కపూర్ సరసన పద్నాలుగేళ్ల వయస్సుకే హీరోయిన్‌గా నటించారు.
షమ్మీ కపూర్, పృథ్వీరాజ్ కపూర్ లాంటి నటుల సరసన నటించింది. 1957లో దేవేంద్ర గోయెల్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘ఏక్ సాల్’. ఈ మూవీలో అశోక్ కుమార్, మధుబాల ప్రధాన పాత్ర ల్లో నటించారు. అప్పట్లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అందుకున్న మొదటి చిత్రం. అలాగే 1949లో విడుదలైన ‘పరాస్’ మూవీ మంచి విజయం సాధించింది.
ఇదొక రొమాంటిక్ మూవీ. ఈ మూవీలో మధుబాలతో పాటు కామినీ కౌశల్, రెహ్మాన్ ప్రధాన పాత్రలో నటించారు. మూవీలో గులాం మొహమ్మద్ స్వరపరిచిన “ఈజ్ దర్ద్ కి మారి దునియా”, “దిల్ కా సహారా చూతే నా”, “దిల్ లే కే చుప్నే వాలే” పాటలకు ఫిదా అయ్యేవారు. అలా అతికొద్ది కాలంలో సినీ పరిశ్రమలో గొప్ప కథానాయకగా ఎదిగింది.
ఆమె నటించిన ‘అమర్’, ‘మహల్’, ‘బాదల్’, ‘తరానా’, ‘మిస్టర్ అండ్ మిసెస్’, ‘చల్తీ కా నామ్ గాడి’, ‘హాఫ్ టిక్కెట్’, ‘హౌరా బ్రిడ్జ్’, ‘కాలా పానీ’, ‘సంగీత బర్సాత్ కి రాత్’ వంటి సినిమాలు హీట్ అయ్యాయి. ముఖ్యంగా ఆరోజుల్లో ‘మొఘల్ ఎ ఆజం’ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. మధుబాల చివరిసారిగా ‘షరాబి’ అనే నాటకంలో నటించింది.
లైఫ్ పత్రిక కవర్ పేజీపై..
ఇండియన్ సినిమాకు మధుబాలను ‘వీనస్ క్వీన్’ లాటింది అని చెప్పాలి. ఆ రోజుల్లో మధుబాలను ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ మార్లిన్‌మన్రోతో పోల్చేవారు. మీనా కుమారి, సురయ్యా వంటి అగ్ర కథానాయికల సరసన ఈవిడ పేరు వినిపించేది.
అందంలో మాత్రం మధుబాలకు ప్రథమ స్థానం. కాబట్టే 1951లో హాలీవుడ్ ఫోటోగ్రాఫర్ జేమ్స్ బర్కి ఇండియా వచ్చినప్పుడు ఆయన దృష్టిని ఆకర్షిచింది. అప్పట్లో ఆయన తీసిన మధుబాల ఫోటో ‘లైఫ్ పత్రిక’ కవర్ పేజీగా వచ్చింది. అప్పటి వరకు ఏ భారతీయ చలన చిత్ర నటి, నటుల ఫోటోలు లైఫ్ పత్రిక ప్రచురించలేదు.
దిలీప్ కుమార్‌తో ప్రేమ..
‘బాంబే టాకీస్’, ‘మహల్’ వంటి పెద్ద చిత్రాల్లో నటించింది. 1944లో మధుబాల ‘జ్వర్ భట’ సినిమా సెట్‌లో నటుడు దిలీప్‌ను కలిశారు. ఆ తర్వాత మధుబాల మనసులో దిలీప్‌పై ప్రేమ చిగురించింది. మధుబాల దిలీప్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ దిలీప్ నిరాకరించారు.
దానికి కారణం మధుబాల కుటుంబం ఈ సంబంధానికి వ్యతిరేకించడం. దిలీప్‌పై కోపంతో గాయకుడు కిషోర్ కుమార్‌తో పెళ్లి చేసుకుంది. కిషోర్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచింది.