calender_icon.png 4 April, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిల్వర్ జూబ్లీ టార్గెట్ లక్షా యాభై వేలు

04-04-2025 12:44:40 AM

  • ఖర్చులు మావి.. జనం మీది

ఎర్రవల్లి ఫాంహౌజ్ లో ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం

కరీంనగర్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి ఈ నెల 27తో 25 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా వరంగల్ లో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం ఎర్రవల్లి ఫాంహౌజ్ లో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు, జిల్లా అధ్యక్షులతో సమావేశమై దిశానిర్దేశనం చేశారు.

ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వరంగల్ సభకు లక్షా 50 వేల మందిని తరలిం చాలని టార్గెట్గా నిర్ణయించారు. వరంగల్ కు సమీపంలో ఉన్న హుజూరాబాద్, కరీంనగర్, మానకొండూర్, హుస్నాబాద్, పెద్దపల్లి ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి 15 వేలు, మిగతా సెగ్మెంట్ల నుంచి 10 వేలు మొత్తంగా లక్షా 50 వేల మందికి సమీకరించాలని నిర్ణయించి సూచనలు చేశారు.

జన సమీకరణ కోసం కావాల్సిన బస్సులు, ఇతర వాహనాలను తాము సమకూరుస్తామని, జనాన్ని తరలించే బాధ్యత మీదని సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై జనాల స్పందన, బీఆర్‌ఎస్ పార్టీ పనితీరు, తదితర అంశాలపై కూడా కేసీఆర్ సమీక్షించారు. వరంగల్ సభ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్, కోరుట్ల ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కె సంజయ్, ఎమ్మె ల్సీ ఎల్ రమణ,, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ రావు, నియోజకవర్గాల ఇంచార్జిలు వొడితెల సతీష్ బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధూకర్, చల్మెడ లక్ష్మీ నరసింహరావుతోపాటు పార్టీల జిల్లా బాధ్యులు హాజరయ్యారు.