calender_icon.png 20 April, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పార్టీకి రజతోత్సవ సభ ప్రతిష్టాత్మకం

16-04-2025 01:33:22 AM

ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి

గజ్వేల్, ఏప్రిల్ 15:   వరంగల్ సభ బిఆర్‌ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి పేర్కొన్నారు. వర్గల్,  గజ్వేల్ లలో  మంగళవారం నిర్వహించిన బిఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గులాబీ పార్టీ అధినేత కెసిఆర్ సారథ్యంలో స్వరాష్ట్రాన్ని సాధించి సగౌరవంగా బిఆర్‌ఎస్ జండా రెపరెపలాడుతుండగా, ఉమ్మడి మెదక్ జిల్లా నుండి లక్ష మందికి తగ్గకుండా రజతోత్సవ సభకు తరలి రావాలని ఆకాంక్షించారు.

ముఖ్యంగా తెలంగాణ ప్రజల కోట్లాది గొంతుకలను ఏకం చేసి సమైక్యపాలకుల కుట్రలు, కుతంత్రాలను తిప్పికొడుతూ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం చేసిన కెసిఆర్ చరితను ఎవరూ కాదనలేని సత్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు పదేళ్లపాటు స్వర్ణ యుగాన్ని తలపించేలా పాలన చేసిన ఆయన పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వందలాది పథకాలకు రూపకల్పన చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచినట్లు తెలిపారు.

అలాంటి నేతకు బాసటగా నిలుస్తూ పార్టీ శ్రేణులు పూర్వవైభవాన్ని తెచ్చే బాధ్యతను భుజాన వేసుకోవాలని చెప్పారు. అయితే రాష్ట్రంలో గజ్వేల్ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉండగా, కెసిఆర్ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసే విధంగా కృషి చేయాలని కోరారు.

కార్యకర్తలకు ప్రతిక్షణం తాము అందుబాటులో ఉంటామని, త్వరలోనే కెసిఆర్ ను గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలు కలిసి ముచ్చటించే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి గుప్త, వైస్ చైర్మన్ జకియోద్దీన్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ వూడెo కృష్ణారెడ్డి, నాచగిరి ట్రస్ట్ బోర్డ్ మాజీ అధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు,   పట్టణ పార్టీ అధ్యక్షులు నవాజ్ మీరా, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సంతోష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.