calender_icon.png 6 November, 2024 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరజ్‌కు రజతం

09-08-2024 02:05:10 AM

జావెలిన్ త్రోలో 89.45 మీటర్ల దూరం విసిరి వెండి పతకం కొల్లగొట్టిన నీరజ్ చోప్రా

ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి రజతం

వీరుడా వందనం!

  1. మరోసారి మెరిసిన నీరజ్ చోప్రా
  2. జావెలిన్ త్రోలో భారత్‌కు రజతం

* నీరజ్ చోప్రా మళ్లీ సాధించాడు.. కానీ ఈసారి స్వర్ణం కాస్త రజతంగా మారింది.  ఈసారి భారీ అంచనాల నడుమ బరిలోకి దిగి 140 కోట్ల భారతీయుల ఆంక్షలను నెరవేరుస్తూ వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకంతో మెరిసి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. అయితే పసిడి కాస్తా రజతంగా మారింది. పర్లేదు.. దేశం మొత్తం తన మీద పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుస్థిర ప్రదర్శనతో వెండి వెలుగులు విరజిమ్మాడు.

ఈ ఒలింపిక్స్‌లో వచ్చిన నాలుగు పతకాలు కాంస్యాలే కావడంతో.. నీరజ్ సాధించిన వెండినైనా బంగారంతో సమానంగా చూడాల్సిందే. ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా చరిత్రకెక్కిన నీరజ్ చోప్రా దేశం ఒడిలో ఐదో పతకాన్ని చేర్చాడు. తరాలు మారినా.. జగాలు మారినా నిన్ను మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం.. ఓ వీరుడా నీకు ఇదే మా వందనం..

పారిస్: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారత్ ఒడిలో తొలి రజతం వచ్చి చేరింది. భారీ అంచనాలు పెట్టుకున్న భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి మెరిసినప్పటికీ ఈసారి దేశానికి వెండి వెలుగులు మాత్రమే తెచ్చాడు. గురువారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ బరిసెను 89.45 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.  పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల ఒలింపిక్ రికార్డుతో స్వర్ణం కైవసం చేసుకోగా.. గ్రెనెడాకు చెందిన పీటర్స్ అండర్సన్ 88.54 మీటర్లతో కాంస్యం గెలుచుకున్నాడు.

పారిస్ క్రీడల్లో భారత్‌కు ఇదే తొలి రజతం కాగా.. ఓవరాల్‌గా ఇది ఐదో పతకం. క్వాలిఫయింగ్ రౌండ్‌లో తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి అర్హత సాధించిన నీరజ్.. ఫైనల్లోనూ ఆ దూకుడు చూపట్టలేకపోయాడు. ఫైనల్లో 8వ స్థానంలో వచ్చిన నీరజ్ ఒకసారి మాత్రమే సరిగ్గా వేసి.. మిగతా ఐదుసార్లు ఫౌల్ చేయడం గమనార్హం. పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 92.97 మీటర్లు విసిరి ఒలింపిక్ రికార్డు నెలకొల్పడం విశేషం. స్వతంత్ర భారతంలో ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన నాలుగో అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డులకెక్కాడు. గతంలో భారత షట్లర్ పీవీ సింధు (2016, 2020), రెజ్లర్ సుశీల్ కుమార్ (2008, 2012) సాధించగా.. ఈ ఒలింపిక్స్‌లోనే మనూ బాకర్ షూటింగ్‌లో రెండు కాంస్య పతకాలు గెలుచుకుంది. ఇక దేశం తరఫున వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు గెలిచిన తొలి అథ్లెట్‌గానూ నీరజ్ చరిత్ర సృష్టించాడు.