calender_icon.png 22 October, 2024 | 11:32 PM

దీపికా కుమారికి రజతం

22-10-2024 01:11:03 AM

ఆర్చరీ ప్రపంచకప్ 

న్యూఢిల్లీ: మెక్సికొ వేదికగా జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి రజతంతో మెరిసింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో దీపికా 0-6తో చైనా ఆర్చర్ లి జియామన్ చేతిలో పరాజయం పాలై రజతం దక్కించుకుంది. పురుషుల, మహిళల విభాగం నుంచి మొత్తం 8 మంది ఆర్చర్లు టోర్నీలో పాల్గొనగా భారత్ నుంచి కేవలం ఒక్క పతకం మాత్రమే వచ్చింది.

తొలుత క్వార్టర్ ఫైనల్లో దీపికా 6-0తో యాంగ్ గ్జియావో లిపై వరుస సెట్లలో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సెమీఫైనల్లో దీపిక 6-4తో మెక్సికొ ఆర్చర్ అలెగ్జాండ్రా వలెన్సియాపై విజయం సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. అయితే ఫైనల్లో అదే ప్రదర్శనను పునరావృతం చేయడంలో విఫలమైంది. కాగా ఆర్చరీ ప్రపంచకప్‌లో దీపికాకు ఇది ఆరో పతకం.

గతంలో 2011, 2012, 2013, 2015లో నాలుగు రజతాలు నెగ్గిన దీపికా 2018లో కాంస్యంతో మెరిసింది. పురుషుల రికర్వ్ విభాగంలో తెలుగు ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర 4-6తో లీ వూ సియోక్ (దక్షిణ కొరియా) క్వార్టర్స్‌లో పరాజయం చవిచూశాడు. ఇక శనివారం జరిగిన కాంపౌండ్ విభాగంలో ప్రతమేశ్, జ్యోతి సురేఖ, ప్రియాన్ష్‌లు మెడల్ రౌండ్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.