- నిర్మాణానికి డిసెంబర్ చివరి వరకు గడువు
- సీవరేజ్ పైపులైన్ల అప్‌గ్రేడ్‌కు సూచన
- సిల్ట్ ఛాంబర్లు లేని భవంతులకు నోటీసులు
- జలమండలి సరికొత్త ప్రయోగం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1౭(విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు భారీగా మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. డ్రైనేజీ పైప్‌లైన్లలో కరగని వ్యర్థాలు లేకుండా సాఫీగా మురుగు పరుగెత్తేలా జలమండలి చర్యలు చేపడుతోంది.
జలమండలి చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌లో మ్యాన్‌హోళ్లను డీ-సిల్టింగ్ చేస్తున్న క్రమంలో డ్రైనేజీ పైప్‌లైన్ల నుంచి కరగని వ్యర్థాలు మురుగు ప్రవాహానికి అడ్డుపడుతుండటంతో మురుగు ఓవర్‌ఫ్లో అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మురుగు నీటిలో కరగని వ్యర్థాలను ఎక్కడికక్కడే నిలువరించేందుకు చర్యలకు ఉపక్రమించింది.
మురుగు అధికంగా ఉత్పన్నమయ్యే బహుళ అంతస్తులు, వాణిజ్య భవనాల సీవరేజ్ కనెక్షన్లకు సిల్ట్ చాంబర్లు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీటి నిర్మాణంతో మురుగంతా ముందుగా సిల్ట్ చాంబర్‌లో చేరుతుంది. అందులో ఏవైనా ఘనపదార్థాలుంటే.. సిల్ట్ చాంబర్‌లో నిలిచి కేవలం మురుగు నీరు మాత్రమే డ్రైనేజీ పైప్‌లైన్‌లోకి కలుస్తుంది.
బహుళ అంతస్తుల సీవరేజీపై దృష్టి
బహుళ అంతస్తుల్లో వినియోగదారులు మురుగు కనెక్షన్లకు సిల్ట్ చాంబర్లు నిర్మించుకోకుంటే కఠినంగా వ్యవహరించాలని జలమండలి యోచిస్తోంది. ఇందులో భాగంగా వాణిజ్య, బహుళ అంతస్తుల భవన సముదాయాలను సిల్ట్ చాంబర్లకే పరిమితం చేసి, మురుగు నీరు మాత్రమే పైప్‌లైన్‌లో కలిసేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా సిల్ట్ చాంబర్లు లేని భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేసి, తక్షణమే నిర్మించు కోవాలని వినియోగదారులకు సూచించనుంది. డిసెంబర్ చివరి నాటి వరకు సిల్ట్ చాంబర్లు నిర్మించుకునేలా గడువు విధించాలని భావిస్తోంది.
నాలుగు ఇండ్లకు ఒక సిల్ట్ చాంబర్
సాధారణంగా కాలనీలు, బస్తీల్లో ప్రతి ఇంటికి ఒక సీవరేజ్ కనెక్షన్ ఉంటుంది. అది జలమండలి సీవరేజ్ లైన్‌కు అనుసంధానమై ఉంటుంది. ప్రతి ఇంట్లో మిగిలి పోయిన ఆహార పదార్థాలు తదితర ఘన పదార్థాలు సీవరేజ్ లైన్‌లో కలిసి మురుగు సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని నివారించడానికి 4, ఆపైన కొన్ని ఇళ్లకు కలిపి ఒక కమ్యూనిటీ సిల్ట్ చాంబర్ నిర్మిస్తే.. ఘనపదార్థాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసే వీలుం టుంది. దీని వల్ల మురుగు సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే దీని వల్ల సీవరేజ్ లైన్ల నిర్వహణ సులభతరం అవుతుందని జలమండలి యోచిస్తోంది.
స్పెషల్ డ్రైవ్‌లో భాగస్వామ్యం కావాలి
సీవరేజీ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే స్పెషల్‌డ్రైవ్‌లో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలి. మురుగు నీటిలో కరగని వ్యర్థాలను వేయకూడదు. వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల నిర్వాహకులు సిల్ట్ చాంబర్లు ఏర్పాటు చేసుకొని వాటిద్వారా సీవరేజ్ కనెక్షన్లను ప్రధాన డ్రైనేజీ పైప్‌లైన్లకు అనుసంధానం చేసుకోవాలి. జలమండలి చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 65 వేల మ్యాన్ హోల్స్ శుభ్రం చేశారు. 8 వేల ప్రాంతాల్లో 930 కిలోమీటర్ల మేర సీవరెజ్ పైపులైన్‌ను డీ-సిల్టింగ్ పనులు నిర్వహించారు.
అశోక్‌రెడ్డి, జలమండలి ఎండీ