మందారంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టు సంరక్షణకు సహాయ పడతాయని నిపుణులు చెబుతున్నారు. మందారంలో ఫ్లేవనాయిడ్స్, అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి మాడుపై రక్త ప్రసరణను పెంచడానికి తోడ్పడతాయి. అలాగే కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కురుల సమస్యలను పరిష్కరించడానికి మందారాన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం..
* జుట్టు ఎక్కువగా రాలుతుంటే.. మందారం పూలను ముద్దగా చేసి అందులో మూడు చుక్కల బాదం నూనె, రెండు చెంచాల ఉసిరి పొడి వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తలకు, జుట్టుకు అప్లు చేసి.. ఒక గంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.
* చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుంటే.. నాలుగు చెంచాల హెన్నా పొడిలో ఎండబెట్టి పొడి చేసిన మందారం ఆకుల్లో కాస్త ఉసిరి పొడి, మెంతుల పొడి వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసుకుంటూ పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి ఆరనివ్వాలి. ఆ తర్వాత.. షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు సమస్య దూరం అవుతుంది.
* జుట్టు దృఢంగా పెరగాలంటే.. ఆరేడు మందారపూలను, పదిహేను మందార ఆకులను తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నాలుగు చెంచాల కొబ్బరి నూనెను వేడి చేసుకోవాలి. అది చల్లారిన తర్వాత ఈ పేస్ట్‌ను అందులో వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి.. గంట పాటు ఉంచాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ అవుతాయి.
* జుట్టు పట్టులా మెరవాలంటే.. నాలుగు చెంచాల పెరుగులోకి.. ఎండబెట్టిన మందార పూల పొడిని వేసి కలపాలి. ఈ చూర్ణాన్ని జుట్టుకు పట్టిస్తే మాడు చల్లగా ఉంటుంది. ఇది ఆరిన తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే పట్టులాంటి జుట్టు మీ సొంతం అవుతుంది.