22-02-2025 12:00:00 AM
అది 1972 ప్రాంతం. నేను డిప్‌ఓఎల్ చదువుతున్నాను. తల్లిదండ్రు లకు నేను చిన్నవాణ్ణి. అప్పటికి నా వయ స్సు 15 సంవత్సరాలు. నేను జన్మించిన సంవత్సరమే మా పెద్దన్నయ్య వివాహమైంది. నాకు కొంచెం తెలివి ఉండగానే మా చిన్నన్న వివాహమైంది. నలుగురక్కలున్నా వారి పెళ్ళిళ్లు ఎప్పడు జరిగాయో గుర్తులేదు. ‘ఎన్నాళ్లున్నా ఏరుబడడం తప్పదు’ అనే సామెత ఉంది. మా అన్నయ్యలు ఇల్లు పం చుకొని వేర్వేరుగా కాపురం పెట్టడానికి నిర్ణయించుకున్నాక, నాన్న నన్ను అడిగాడు “చెన్నప్పా! నువ్వు ఒప్పుకుంటే అన్నయ్యలు ఏరుబడతారు. నీకిష్టమేనా?” అంగీకరిస్తున్నట్టుగా తలూపాను.
అప్పటికి నా చదువు పూర్తి కాలేదు. ఉద్యోగమూ లేదు కనుక, పెళ్లి ప్రస్తావనే ఉం డదు. మేం ముగ్గురం అన్నదమ్ములం. ఆస్తిని పంచుకోవడం వల్ల నా పాలుకు ‘ఇంట్లోని 3వ భాగం (6 గదులు), ఓ పాత సైకిల్ వ చ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నా పెళ్లికిగాను ఒక పట్టుచీరను పక్కకు తీశారు. దాని విలువ ఆ కాలంలో రూ. 125. ఐతే, నా పెళి ఖర్చుల కోసం దానిని చిన్నన్న అమ్మేశాడు. ఇంకోరోజు, నా ఇంటి భాగాన్నీ అమ్మేసి రూ. 5,000 తెచ్చిచ్చాడు. కానీ, నా పెళ్లికోసం కేటాయించిన ఆ పట్టుచీరను మాత్రం అమ్మకుండా ఉంటే బావుండేదనిపించింది.
1975లో నాకు ఉద్యోగం వచ్చింది. నా పెళ్లి (1976) సందర్భంగా మా అత్తగారి నుంచి మూడు పట్టుచీరలు వచ్చాయి. కానీ, అవేవీ అమ్మానాన్నలు ఇచ్చిన పట్టుచీరకు సమానం కావనిపించింది. ఎందుకంటే, దానిని మా పెద్దన్నయ్య స్వయంగా నేసారు కనుక. తర్వాత, మా ఆవిడ 40 ఏళ్ల కాపురంలో ఎన్నో పట్టుచీరలు నాతో కొనిపిం చింది. ఎన్నున్నా కోల్పోయిన ఆనాటి ఆ పట్టుచీరే ఎప్పుడూ గుర్తుకు వచ్చేది.
వదిన కోసం పెద్దన్నయ్య పట్టుచీర నేసేవాడు. దాన్ని ఆమె కట్టుకోక ముందే, కనీసం మడతయినా విప్పక ముందే అమ్మకానికి (గిరాకి) వచ్చేది. అన్నయ్య అమ్మేసేవాడు. తిరిగి కొత్తగా మరొక పట్టుచీర నేసేవాడు వదిన కోసమని. దురదృష్టం కొద్దీ అదీ బేరం రావడంతో వెళ్లిపోయేది. చిన్న వదిన విషయంలోనూ ఇలాగే జరిగింది. అన్నయ్య స్వయంగా నేసిన పట్టుచీరను కట్టే అవకాశం ఆమెకూ ఎన్నడూ రాలేదు.
ఎవరికైనా సొంతంగా తయారుచేసిన వస్తువును ఉపయోగించుకోలేని పరిస్థితి ఎదురైనప్పుడు చాలా బాధేస్తుంది. ఆనాటి చేనేత కుటుంబాల్లో పెళ్ళిళ్ల సమయంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగేవి. మా వదిలన కోసం నేసిన పట్టుచీరల్ని వారెట్లాగైతే కట్టుకోలేక పోయారో అట్లాగే, మా ఆవిడ కోసం పెళ్లికి ముందుగా నేసిన పట్టుచీర కూడా ఆమెకు దక్కలేదు. భగవంతుని లీలలు ఒక్కోసారి మనలను విస్మయ పరుస్తాయి. వాటిలో ఇదొకటేమో.
ఎంతయినా పట్టుచీర విలువ పట్టుచీరదే. ప్రత్యేకించి పట్టుచీరలంటే మనసు పారే సుకోని మగువలు ఉండరు. మేం ఎప్పుడు బట్టల దుకాణానికి వెళ్లినా నా భార్య ప్రమీల ఒక్క పట్టుచీరయినా తప్పక కొనేది. ఒక్కోసారి తన కోడళ్లకూ కొనిచ్చేది. ఆమె దివం గతురాలయ్యే నాటికి అల్మారాల్లో సుమారు వంద పట్టుచీరలైనా ఉండేవి. అవేవీ నన్ను బలవంత పెట్టి కొన్నవి కావు. ఎన్ని వున్నా మిస్ అయిన ఆనాటి ఆ పట్టుచీరను ఆమె బతికి ఉండగా కట్టుకోలేక పోయిందన్న బాధ ఆమెకంటే నాకే ఎక్కువగా ఉండేది. ఇది ఇంతటితో ఆగక, తీరని వేదనగా, భరింపరాని దుఃఖంగా మారే సందర్భమూ వస్తుందని నేను కలలోనైనా అనుకోలేదు.
దేనికైనా అదృష్టం ఉండాలి!
మా అమ్మాయి పెళ్లిలో, ఆమె అత్తగారికి, దగ్గరి బంధువులకూ పట్టుచీరలు కొనిపించింది ప్రమీల నాతో. ఒకనాడు అడిగాను “నీకు పట్టుచీరలంటే ఎందుకంత ఇష్టం.. ప్రమీలా?” అని. దానికామె ఇచ్చిన సమాధానం నన్నాశ్చర్యపరిచింది. “నేను మా అమ్మమ్మ గారింట్లో కదా జన్మించాను. మా ఇల్లు రాంకోఠీలో ఉంది. కోఠీలో రోడ్డుకు ఇరువైపుల బట్టలు, బంగారు దుకాణాలు బారులు తీరి ఉంటాయిగా. నేను అప్పటికి చిన్నదాణ్ణి. లంగా వోణీలతో సరిపుచ్చుకునేదాన్ని. పెద్దయ్యాక, అమ్మమ్మ ఇంటికి నాలు గడుగుల దూరంలోని తుంగస్వామి బట్టల దుకాణంలోనే పట్టుచీరలు కొని ధరించాలనుకున్నాను..” అంది. ఆ పెళ్ళి సందర్భంగా అదే బట్టల దుకాణానికి వెళ్లి ‘వెయ్యి రూపాయలకు మూడు పట్టుచీరలు’ కొన్నాను.
ప్రమీల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడానికి ఒక పది రోజుల ముందు మా అన్న కుమారుని ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమం లో మేమంతా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నాం. అన్న కొడుక్కు హైదరాబాద్‌లో నే ఒక పట్టుచీరల దుకాణం ఉండింది. కొత్త షాప్ కనుక, మొదటిసారి వెళ్లినప్పుడు ఏదో ఒక చీర కొనడం ఆనవాయితీ. ప్రమీలకు ఒక పట్టుచీర బాగా నచ్చింది. నిజానికి అది నేను వేరుపడినప్పుడు నా పాలుకు వచ్చిన చీరలాగే ఉంది. మా ఇద్దరు పిల్లలు ‘నేనంటే నేనని’ చీరను కొనడానికి పోటీ పడ్డారు. కానీ, ప్రమీల దానిని నాతోనే కొనిపించింది.
దానిని ‘ఎప్పుడు కట్టుకుంటుందా!’ అని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఒకనాడు అదే అడిగితే “పట్టుచీర బాగుంది. కొననైతే కొన్నాను. కాని, దాన్ని ఎప్పుడు కట్టుకుంటానో నాకే తెలియదు. కొన్న ప్రతి దానినీ వాడుకొనే అదృష్టం మనకుండాలిగా..” అం ది. ఆ మాటలు తన నోటినుంచి ఎందుకు, ఎలా వచ్చాయో అప్పటికైతే నాకర్థం కాలే దు. కానీ, ఆ చీర కొన్న 15 రోజులకే ప్రమీల దివంగతురాలైంది. కనీసం అలాంటి మరో కొత్త పట్టుచీరకైనా తాను నోచుకోకుండానే వెళ్లిపోయింది. దానిని తన పార్థివ శరీ రం మీద కప్పడం తప్ప నేను మరేమీ చేయలేక పోయాను, కట్టలు తెంచుకుంటున్న నాలోని దుఃఖాన్ని గొంతు దగ్గరే అదిమిపడుతూ.
ఆచార్య మసన చెన్నప్ప,
వ్యాసకర్త సెల్: 9885654381