calender_icon.png 21 November, 2024 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతిపై మౌనమేలా?

13-11-2024 12:12:18 AM

  1. కందనూలు మున్సిపాలిటీలో రూ.కోట్ల ప్రజాధనం పక్కదారి 
  2. కంటితుడుపుగా ఒకరిపై సస్పెన్షన్ వేటు
  3. రికవరీ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం

నాగర్‌కర్నూల్, నవంబర్ 12 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ మున్సిపల్‌లో అవినీతి రాజ్యమేలుతున్నదని ఆరోపణలొస్తున్నాయి. పట్టణ ప్రజలు కట్టే పన్నులతో మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సింది పోయి పన్నుల డబ్బుతో పాటు ప్రభుత్వ నిధులను కూడా అమాంతం మింగేసి అక్రమార్కులు కోట్లు కొల్లగొడుతున్నారని గత కొంతకాలంగా విమర్శలు వ్యక్తం అవుతున్నా యి.

దీనిపై విజయక్రాంతితోపాటు ఆయా ప్రధాన పత్రికల్లోనూ వార్తా కథనాలు వెలువడ్డాయి. అయినా పట్టింపు లేకుండా ఉన్నతాధికారులు వ్యవహరిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

పక్కదారి పట్టిన నిధులు..

చెత్త సేకరణ పేరుతో వాహనాలకు పరిమితికి మించి డీజిల్‌ను వాడినట్లు నకిలీ బిల్లు సృష్టించి కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు జీత భత్యాలు కూడా పక్కదారి పట్టించి రూ.కోటి వరకు సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు అధికారులు తేల్చారు. పారిశుద్ధ్య నిర్వహణ, నీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, నూతన సీసీ రోడ్ల ఏర్పాటు, ట్రేడ్ లైసెన్స్‌ల జారీల్లో అక్రమాలు జరిగినట్టు తెలుస్తున్నది.

ప్రజాప్రతినిధులు, పొలిటికల్ లీడర్లు, వ్యాపారులతో కుమ్మక్కై కార్యాలయాల్లోని కిందిస్థాయి సిబ్బంది మొదలుకుని కమిషనర్ వరకు అడ్డగోలుగా ముడుపులు అందుకుని అక్రమ నిర్మాణాలకు సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మున్సి పాల్టీలోని ఉద్యోగులు అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేయడం ద్వారా నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లోని ప్రభుత్వ భూములన్నీ భూ భకాసురుల చేతుల్లోకి వెళ్లాయని ప్రచారం జరుగుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినా తమకేమీ పట్టన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. షాపింగ్ క్లాంపెక్స్‌లు, ఫంక్షన్ హాల్స్ సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినా నిర్వాహకుల నుంచి నెలసరి మామూళ్లు తీసుకుంటూ చర్యలు తీసుకోవడం మరిచారని తెలుస్తున్నది. కానీ నిరుపేదలు ఒక్క ఏడాది పన్నులు కట్టడం మరిచినా వారికి జరిమానాల మీద జరిమానాలు వేసి ముక్కుపిండి మరీ వసూలు చేసిన సంఘటనలు నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో జరిగాయి.

అంతేకాకుండా నిబంధ నలకు విరుద్ధంగా ప్రధాన రహదారులకు ఆనుకుని అక్రమ షెడ్డుల నిర్మాణాలు జరుగుతున్నా డబ్బులను దండుకుని చర్యలు తీసుకోవడంలేదని తెలుస్తున్నది. పదేండ్ల క్రితం కూడా రూ.కోటికి పైగా లూటీ జరిగిందని ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రికవరీ చేపట్టలేదు. ఇదే అదునుగా భావించిన ప్రస్తుత అధికారులు అవినీతిని వారస్వతంగా కొనసాగిస్తున్నారని పలువురు స్థానికులు అంటున్నారు. 

సమాధులను శుభ్రం చేసినట్టు బిల్లులు 

నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌ల సొంత వాహనాలకు ప్రభుత్వ ధనంతో పాటు డీజిల్ (పెట్రోల్)ను కూడా వాడుకుంటున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముస్లిం మతస్థుల సమాధులను శుభ్రం చేసినట్లు కూడా బిల్లులు పెట్టుకోవడం చూస్తే ప్రజాధనం ఏ విధంగా లూటీ చేస్తున్నారో అర్థమవుతుంది.

మున్సిపా లిటీలో అవినీతిపై విజయక్రాంతి గత కొంతకాలంగా కథనాలు ప్రచురించగా స్పందించిన ప్రజా సంఘా లు, బీఎస్పీ నేతలు సీబీఐ చేత విచారణ జరిపించాలని నేరుగా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయినా ఈ వ్యవహారంపై కేవలం ఒక రెగ్యులర్ ఉద్యోగితో పాటు మరో తాత్కాలిక ఉద్యోగిని సస్పెండ్ చేశారు. వారి నుంచి నిధులు మాత్రం రికవరీ చేయకుండా మౌనం వహించడం పట్ల ఉన్నతాధికారుల తీరుపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.