రంగంలోకి 35 బృందాలు
పులి గాండ్రింపు విని భయంతో స్పృహ కోల్పోయిన రైతు
కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని అంకుశాపూర్ అటవీప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివారులోని బియ్యం గోదాముల సమీపంలో పులి సంచరిస్తుందనే వార్త దావానంలా వ్యాపించడంతో ఏజెన్సీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది 35 బృందాలుగా విడిపోయి పులి కోసం గాలిస్తున్నారు. అటవీప్రాంతాన్నంతా జల్లెడ పడుతున్నారు.
ప్రత్యేకంగా డ్రోన్లు తెప్పించి నిఘా పెట్టారు. కాగా, వాంకిడి ప్రాంతంలోని వ్యవసాయక్షేత్రంలో మంగళవారం ఓ రైతు పనిచేస్తుండగా, పులి గాండ్రింపు వినిపించింది. దీంతో ఆ రైతు భీతిల్లి స్పృహ కోల్పోయాడు. గమనించిన తోటి రైతులు వెంటనే ఆ రైతును ఆసుపత్రికి తరలించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మరోవైపు సిర్పూర్(టి) మండలం పెద్దబండ సమీపంలో పులి సంచరిస్తున్నట్టు స్థానికులు అటవీశాఖకు సమాచారమిచ్చారు. సిర్పూర్ రేంజ్ పరిధిలోని ఇట్యాకల్ పహాడ్ సమీపంలో ఫారెస్ట్ సిబ్బంది పులి పాదముద్రను గుర్తించారు.