calender_icon.png 28 October, 2024 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15న సచివాలయ ముట్టడి

08-07-2024 01:43:12 AM

బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): సమగ్ర కులగణనతోపాటు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాల సాధన కోసం ఈనెల 15న సచివాలయాన్ని ముట్టడిస్తామని బీసీ జనసభ అధ్యక్షుడు డి.రాజారాం యాదవ్ తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, పలు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం వెంటనే కామారెడ్డి యూత్ డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సమగ్ర కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల హామీ ఏమైందని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. సీఎం ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను సాధించేవరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. సచివాలయ ముట్టడికి రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు, పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెంచాలన్నారు. సమగ్ర కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మేకల కృష్ణ, గోవర్ధన్, రాంకోటి, రామ్మూర్తి గౌడ్, రాజు, నరహరి పాల్గొన్నారు.