calender_icon.png 22 December, 2024 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్ధూ సీటు నాదే!

14-09-2024 03:09:37 AM

  1. కర్ణాటకలో సీఎం కుర్చీ కొట్లాట
  2. సిద్ధరామయ్యకు ఉద్వాసనేని ప్రచారం
  3. నేనే తదుపరి సీఎం అని నేతల ప్రకటనలు
  4. సైలెంట్‌గా పని చేసుకొంటున్న డీకే

బెంగళూరు, సెప్టెంబర్ 13: కర్ణాటకలో కుర్చీ కొట్లాట మరింత రసకందాయంగా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉండగానే, సీనియర్ కాంగ్రెస్ నేతలంతా నేనే తదుపరి సీఎం అంటే... నేనే సీఎం అని ప్రకటలు చేస్తున్నారు. ముడా భూ కేటాయింపుల కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం జోరందుకోవటంతో కాంగ్రెస్ నేతల్లో ఆ పదవిపై ఆశలు పెరుగుతున్నాయి. మరోవైపు సీఎం పదవికి ప్రధాన పోటీదారు అయిన డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్ మాత్రం తెరవెనుక సైలెంట్‌గా పనిచేసుకొంటూ పోతున్నారు. 

సీఎం మార్పు తప్పదా?

ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు ఇటీవల రాష్ట్ర గవర్నర ఏసీబీకి అనుమతి ఇచ్చారు. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లి తాత్కాలికంగా స్టే తెచ్చుకొన్నారు. దాదాపు రెండేండ్ల క్రితం కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చినప్పుడే సీఎం పదవిపై చాలాకాలం వివాదం నడిచింది.

ఎన్నికల్లో పార్టీని గెలిపించింది తానేనని, అందువల్ల సీఎం పదవి కూడా తనకే దక్కాలని ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకొన్న డీకే శివకుమార్ నాడే పట్టుబట్టారు. పార్టీ అధిష్ఠానం ఏదో విధంగా అప్పుడు సమస్యను పరిష్కరించి సిద్ధూను సీఎం సీట్లో కూర్చోబెట్టింది. కానీ, ఎప్పటికైనా డీకేనే సీఎం అవుతారని పార్టీలోని ఒక వర్గం అప్పటి నుంచీ చెప్తూనే వస్తున్నది.

తాజాగా సిద్ధరామయ్యపై అవినీతి ఆరోపణలు రావటంతో ప్రతిపక్షంతోపాటు అధికార పక్షంలోని నేతలు కూడా ఆయనను సాగనంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు.  

ఎవరైనా సీఎం కావచ్చు!

సిద్ధరామయ్యకు ప్రతిపక్ష బీజేపీకంటే అధికార కాంగ్రెస్ నేతలు ఎక్కువ తలనొప్పిగా మారారు. స్వయంగా ఆయన ఆర్థిక సలహాదారే తానూ సీఎం రేసులో ఉన్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. సీఎం ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి మాట్లాడుతూ.. ‘ఎవరైనా సీఎం కావచ్చు. నేను కూడా అర్హుడినే’ అని వ్యాఖ్యానించారు.

ఇక రాష్ట్రమంత్రులు ఎంబీ పాటిల్, శివానంద పాటిల్ అయితే.. అప్పుడే సీఎం కుర్చీ ఖాళీ అయిపోయినట్టు.. తనంటే తనకే ఆ సీటు దక్కాలన్నట్టు తిట్టుకున్నారు. సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తే.. తనకే అన్నిరకాలుగా అర్హత ఉందని అని రాయరెడ్డి పేర్కొన్నారు.  

సీఎం సీటు ఖాళీగా లేదు: సిద్ధూ

దీనిపై స్పందించిన సిద్ధరామయ్య ఓ స్పష్టమైన సందేశం ఇచ్చారు. సీఎం సీటు ఖాళీగా లేదని, ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు.  మరోవైపు సీఎం అభ్యర్థి మారితే తానే ఆ కుర్చీలో కూర్చుంటానని డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్ దీమాగా ఉన్నారు. 

మాకంటే కాంగ్రెస్ నేతలకే ఎక్కువ నమ్మకం: బీజేపీ

అధికార పార్టీలో సీఎం కుర్చీ కోసం జరుగుతున్న కొట్లాటను ప్రతిపక్ష బీజేపీ ఎద్దేవా చేసింది. ‘సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేస్తారని బీజేపీ కంటే కాంగ్రెస్ నేతలే గట్టి నమ్మకంతో ఉన్నారు. సీఎం సీటుకోసం ఆ పార్టీలో పరుగు పందెం మొదలైంది. ప్రతి ఒక్కరూ తానే సీఎం అభ్యర్థినని ప్రకటించుకొంటున్నారు. రాష్ట్రంలో పైసా అభివృద్ధి జరగటం లేదు’ అని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు ఆర్ అశోక విమర్శించారు.