calender_icon.png 27 September, 2024 | 3:16 AM

సిద్ధూ ఔట్.. డీకే ఇన్!

25-09-2024 04:23:30 AM

  1. నెలఖరుకు కర్ణాటక సీఎం మార్పు?
  2. అవినీతి ఆరోపణలతో సిద్ధూ సీటుకు ఎసరు
  3. హైకోర్టు తీర్పుతో మరింత బలపడిన అవకాశాలు
  4. ఇప్పటికీ సైలెంట్‌గానే డిప్యూటీ సీఎం శివకుమార్
  5. ముడా కేసులో మాత్రం సీఎంకు మద్దతు తెలిపిన డీకే

బెంగళూరు, సెప్టెంబర్ 24: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై పలు కుంభకోణాల ఆరోపణలు చుట్టుముడుతున్న వేళ ఆయనను పదవి నుంచి తొలగిస్తారనే ఊహాగానా లు వెలువడుతున్నాయి. దీంతో కర్ణాటకలో కుర్చీ కొట్లాట ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

కర్ణా టక పీఠాన్ని సొంతం చేసుకునేందుకు మంత్రులు, సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య వాగ్వాదం సైతం జరిగింది. శివానంద్ పాటిల్, ఎంబీ పాటిల్ సీఎం పదవికి సంబంధించి మీడియా సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ వివా దంపై స్పందించిన సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు అన్నివిధాలుగా సీఎం అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాత్రం తెరవెనుక సైలెంట్‌గా తన పని చేసుకుంటూ వెళుతున్నారు.

కానీ, ఈ నెలాఖరులోగా డీకే శివకుమార్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఊహాగానా లు వినిపిస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ క్యాడర్‌లోనూ ఇదే చర్చ జరుగుతోంది. త్వరలోనే సీఎం మార్పు తథ్యమని, డీకే ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు. దీనిపై పార్టీ లేదా కీలక నేతలు మాత్రం స్పందించడం లేదు. 

డీకే హస్తముందా?

ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఇచ్చిన ఆదే శాలను సమర్థిస్తూ మంగళవారం కర్ణాటక హైకోతర్టు అందుకు అనుమతిచ్చింది. దాదా పు రెండేళ్ల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే సీఎం పదవిపై చాలాకాలం వివాదం నడిచింది. ఎన్నికల్లో ముందుండి పార్టీని గెలిపించానని, అందువల్ల సీఎం పదవి తనకే దక్కాలని డీకే శివకు మార్ ఆనాడు పట్టుబట్టారు.

సిద్ధరామయ్య, డీకేఎస్ మధ్య దాదాపు ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం నెలకొంది. అధిష్ఠానం ఇద్దరు నేతలను సముదాయించి సీనియర్ సిద్ధరామయ్యను సీఎంగా చేసింది. కానీ, డీకేఎస్ వర్గం మాత్రం ఎప్పటికైనా సీఎం అవుతారని చెబుతూనే వస్తోంది. తాజాగా సిద్ధరామయ్య పై వివిధ స్కాముల్లో ఆరోపణలు రావడం, ప్రతిపక్షంతో పాటు సొంత పక్ష నేతలు సైతం ఆయనను సాగనంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రంలో జరిగే పరిణామాలు, సీఎం ఆరోపణల వెనుక డిప్యూటీ సీఎం డీకేఎస్ హస్తముందని ఊహాగానాలు వినిపిస్తు న్నాయి. పలు కుంభకోణాలు బయటికి రావడంలో ఆయన క్యాడర్ పని చేసిందనే ఆరో పణలు సైతం వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో డీకే సైలెంట్‌గానే ఉంటున్నారు. 

సీఎంకు మద్దతుగావ్యాఖ్యలు

డిప్యూటీ సీఎం శివకుమార్ మాత్రం ఎక్కడా తన వైఖరిని స్పష్టం చేయటంలేదు. సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. హైకోర్టు తీర్పు తర్వాత కూడా సిద్ధరామయ్యకు మద్దతుగా బీజేపీ వైఖరిని తప్పుబట్టారు. సిద్ధరామయ్య కు వ్యతిరేకంగా బీజేపీ రాజకీయ కుట్ర చేస్తోందని ఆరోపించారు.

‘సిద్ధరామయ్యకు మద్దతుగా నిలుస్తాం. సీఎం, ఆయన కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదు. విచారణ తర్వాత సీఎం క్లీన్‌గా బయటకు వస్తారు. హైకోర్టు తీర్పును సమగ్రంగా చదివిన తర్వాత పూర్తిస్థాయిలో ఈ విషయంపై స్పంది స్తా. రాష్ట్రానికి సిద్ధరామయ్య ఎంతో మేలు చేశారు.

కానీ, బీజేపీ ఎప్పటికీ మంచి పనిని సహించదు. నా విషయంలోనూ గతంలో బీజేపీ ఇలాగే వ్యవహరించింది’ అని డీకేఎస్ మంగళవారం పేర్కొన్నారు. అంతేకాకుండా రాజ్‌భవన్ బీజేపీ ఆఫీస్‌లా మారిందని ఆరోపించడం కొసమెరుపు.