సీఎం సిద్ధరామయ్య
- కర్ణాటక ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు ప్రధాని నిరూపించాలి
- నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా:
బెంగళూరు, నవంబర్ 11: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ఖండిం చారు. ఈ మేరకు మోదీకి సిద్ధరామయ్య సవాలు విసిరారు. ఆయన చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను రాజకీయా ల నుంచి వైదొలుగుతానని, లేదంటే మోదీ తప్పుకోవాలని సిద్ధరామయ్య అన్నారు.
ఇటీవల మహారాష్ట్రలో మోదీ మాట్లాడుతూ.. కర్ణాటక ఎక్సైజ్ శాఖలో భారీ కుంభ కోణం జరిగిందని, దీని ద్వారా వచ్చిన డబ్బును మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తోందని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉంటే అది వాళ్లకు డబ్బులు అందించే ఏటీఎంగా మారిపోతుందని విమర్శలు చేశారు. కాంగ్రెస్ రాజ కుటుంబానికి ప్రస్తుతం తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలు ఏటీఎంలుగా పనిచేస్తున్నాయని అన్నారు.
రూ.700 కోట్ల కుంభకోణం
కర్ణాటకలో లిక్కర్ వ్యాపారుల నుంచి రూ.700 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని మోదీ చెప్పారు. కాగా, ఇటీవల కర్ణాటక వైన్స్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖపై తీవ్ర ఆరోపణలు చేసింది.