calender_icon.png 15 November, 2024 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్ధప్ప తత్త్వాలు

08-07-2024 12:00:00 AM

గొప్పవాడననుగాను, కోవిదుడనుగాను 

తప్పులున్నను దిద్దుడీ తండ్రులార

ఘటము కంటెను వేరైన మఠము లేదు, 

ఆత్మకంటెను వేరైన హరియు లేడు.

మట్టి ఒకటె కుండలు వేరు

బంగార మొక్కటె సొమ్ములు వేరు

ఇనుము ఒక్కటె పనిముట్లు

ఆయుధాలు వేరు.

పుట్టుగొడ్డుకు పిల్లపుట్టు బాధేమెరుక

పదిమందిని గన్న పడతికెరుక

అయ్యవార్లకు అడవి అంత్యంబులేమెరుక

చెలగి దిరిగెడు రామచిలుక కెరుక.

అజ్ఞానియే శూద్రుడవనిలో నెవడైన

సుజ్ఞానుడే యాత్మ సుజనుడతడు

వేదంబు జదివినా విప్రుడా విహితుండు

బ్రహ్మమెరిగిన వాడె బ్రాహ్మణుండు

వర్తకంబును జేయు వణిజుండు వైశ్యుండు

అవని పాలించిన నరుడె ప్రభువు

సకల నిందలు నోర్చు సదయిడు నరుడౌను

మత భేద మిడిచిన యతివరుండు

జన్మచేతను వీరింక కలియుగమున

పేరుగాంచిన యెవరెవరి బేర్మి పనులు

వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప

కనుడి కరమొప్ప కవికుప్ప కనక మప్ప.

సిద్ధప్ప వరకవి