calender_icon.png 26 December, 2024 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్కాతమ్ముళ్ల రచ్చ!

01-08-2024 01:08:36 AM

సబితా x రేవంత్ !

  1. ఇద్దరి వాగ్వాదంతో దద్దరిల్లిన శాసనసభ
  2. నన్ను ఎందుకు టార్గెట్ చేశారు : సబితా ఇంద్రారెడ్డి
  3. నా వెంట ఉంటా అని చెప్పి మోసం చేశారు: సీఎం రేవంత్
  4. వెల్‌లోకి దూసుకొచ్చిన బీఆర్‌ఎస్ ఎమెల్యేలు
  5. సీఎం ఎవరి పేరునూ ప్రస్తావించలేదు: శ్రీధర్‌బాబు

* వెనకాల కూర్చున్న అక్కలు.. ఇక్కడ ముంచే అక్కడ తేలిర్రు. ఆ అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తది. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ఈ వ్యాఖ్యలు అగ్గిని రాజేశాయి. 

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): అసెంబ్లీ వేదికగా అక్కాతమ్ముళ్ల మధ్య పార్టీ ఫిరాయింపులపై జరిగిన డైలాగ్ వార్ సంచలనంగా మారింది. ద్రవ్య వినిమయ బిల్లుపై కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకవైపు ప్రభుత్వాన్ని విమర్శి స్తూనే.. సహకరిస్తామంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభలకే రానప్పుడు, కలిసొస్తాము, సహకరిస్తామంటే ఎలా నమ్మా లని ప్రశ్నించారు. ఇదే సమయంలో కేటీఆర్ వెనుకాల కూర్చున్న సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. అనంతరం రేవంత్‌రెడ్డి పైవిధంగా వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కలుగజేసుకున్న మంత్రి శ్రీధర్‌బాబు.. సీఎం ఎవరి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదని, ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేయడం సరికాదన్నారు.

నేను ఎవరిని మోసం చేశా? : సబితా 

ఈ గొడవ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డికి స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక, కేసీఆర్ ఇంటిమీద వాలిన కాకి.. తన ఇంటిపై వాలితే కాల్చేస్తానని చెప్పారని, ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. తాను ఏం మోసం చేశానో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ కాంగ్రెస్‌లోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆహ్వానించానని, పార్టీలో భవిష్యత్తు ఉంటదని, నాయకుడిగా ఎదుగుతావని చెప్పానని అన్నారు. రేవంత్‌రెడ్డి గుండెపై చేయి వేసుకొని చెప్పాలని కోరారు. కానీ, తనపై ఎందుకు కక్ష తీర్చుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.  ప్రతి అసెంబ్లీలో తనపై మాట్లాడుతున్నారని భావోద్వేగానికి గురయ్యారు. సీఎం చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

నన్ను మోసం చేసి అధికారం కోసం బీఆర్‌ఎస్‌లోకి : సీఎం రేవంత్ రెడ్డి

తాను కాంగ్రెస్‌లోకి వస్తే భవిష్యత్ బాగుంటుందని సబితమ్మ చెప్పిన మాటలు వాస్తవమేని అని సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పుకొన్నారు. తమ మధ్య జరిగిన సంభాషణను సబితమ్మ బటయపెట్టింది కనుక.. తాను కూడా మరికొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నట్టు వెల్లడించారు. 2018లో కొడంగల్‌లో తాను ఓడిపోయిన తర్వాత.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయమని ప్రోత్సహించారని గుర్తుచేశారు. తనకు బీఫాం వచ్చిన తర్వాత సబితమ్మ కేసీఆర్ మాయ మాటలు నమ్మి అధికారం కోసం కాంగ్రెస్‌ను వదిలి బీఆర్‌ఎస్‌లో చేరినట్టు చెప్పారు. సొంత అక్కలా అనుకున్నానని, తమ్ముడిని మోసం చేసింది కాబట్టే ఆమెను నమ్మొద్దని కేటీఆర్‌కు సూచించినట్టు తెలిపారు. ఇది నిజం కాదా? అని సబితమ్మను గుండెమీద చేయి వేసుకొని చెప్పాలన్నారు.

బీఆర్‌ఎస్ చేస్తే ఒప్పు..  కాంగ్రెస్ చేస్తే తప్పా : మంత్రి సీతక్క

రేవంత్‌రెడ్డి వివరణ అనంతరం బీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద వెల్‌లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో సీతక్క స్పందించారు. ‘మీ పార్టీలో చేర్చుకుంటే గొప్పా, మేం చేర్చుకుంటే తప్పా కేటీఆర్’ అంటూ నిలదీశారు. కలిసివస్తానని రేవంత్‌ని మోసం చేసిన అక్కలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదేండ్లు మంత్రి పదవి ఎంజాయ్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిడితే చప్పట్లు కొడుతారా? అని ప్రశ్నించారు. కేటీఆర్ ఇకనైనా దురహంకారాన్ని తగ్గించుకో అని హితవు పలికారు. ‘మీకు ఏమీ తెలియదు’ అనే మాటలు మానుకో అని సూచించారు. బీఆర్‌ఎస్ చేస్తే ఒప్పు.. కాంగ్రెస్ చేస్తే తప్పా అని అడిగారు.