calender_icon.png 10 October, 2024 | 9:54 AM

సంతకాలకు సై.. రికవరీకి నై!

10-10-2024 01:34:31 AM

ధాన్యం కేటాయింపుల్లో మిల్లర్ల అసోసియేషన్ ఆధిపత్యం

సీఎంఆర్ రికవరీ విషయంలో సాయం చేయని వైనం 

అసోసియేషన్ పెద్దల కనుసన్నల్లో సీఎంఆర్ ఎగవేతదారులు

రాష్ట్రంలో డిఫాల్టర్ల జాబితాలో 1000 వరకు రైస్ మిల్లులు

రాజకీయ పార్టీలకు అనుబంధంగా అసోసియేషన్లు

గ్యారెంటీ సంతకాలు చేసిన అసోసియేషన్లు, ప్రతినిధులపై కేసులు పెట్టాలని చిన్న మిల్లర్ల డిమాండ్

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ఏటా రెండు సీజన్ల (ఖరీఫ్, రబీ)లో వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొ నుగోలు, మిల్లింగు, సీఎంఆర్ అప్పగింతల వ్యవహారంలో ఆధిపత్యం చెలాయిస్తున్న రైస్ మిల్లర్ల అసోసియేషన్లపై అటు అధికార యంత్రాంగంలో, ఇటు మిల్లర్లలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అసలు అసోసియేషన్లు అవసరమా? వాటికి ఎందుకంత ప్రాధాన్యం? రైస్ మిల్లర్లకు ధాన్యం అప్పగింతలో అసోసియేషన్ల గ్యారంటీలు ఎందుకు? దానిని అడ్డంపెట్టుకుని బడా వ్యాపారులు ధాన్యం మాయం చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదనే విమర్శలు వినపడుతున్నాయి. 

ధాన్యం ఇవ్వాలంటే సంతకం కావాల్సిందే

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, మిల్లింగ్ చేయడానికి పౌరసరఫరాల సంస్థ రైస్ మిల్లర్లకు అప్పగిస్తుంటుంది. అయితే, మిల్లర్లకు ధాన్యం ఇవ్వాలంటే మధ్యలో మిల్లర్ల అసోసియేషన్ గ్యారెంటీ సంతకం చేయాల్సి ఉంటుంది. ఇక్కడే అసోసియేషన్లకు ఆధిపత్యం వహించడానికి అవకాశం కల్పించినట్టయ్యింది.

గత ప్రభుత్వ హ యాంలో అనేక మంది రాజకీయ నాయకు లు, ప్రజాప్రతినిధులు రైస్ మిల్లర్ల అవతారమెత్తారు. రూ.వేల కోట్ల ధాన్యాన్ని కేటా యించుకునేలా చేసి బహిరంగ మార్కెట్లో తెగనమ్ముకున్నారు. అసోసియేషన్లను గు ప్పిట పెట్టుకున్నారు. దీంతో బడా వ్యాపారులు, రాజకీయ నేతలు చెప్పిందే వేదంలా మారింది. అయితే వారి నిర్ణయాలన్నీ అసోసియేషన్ ద్వారా అమలు చేయించేవారు.

పైగా రాజకీయ పార్టీల వారీగా అసోసియేషన్లు కూడా ఏర్పాటయ్యాయి. అంటే అధికార పార్టీకి ఒక మిల్లర్ల అసోసియేషన్ ఉంటే, ప్రతిపక్ష పార్టీలకు కూడా అసోసియేషన్లు ఉండటం గమనార్హం. ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ అనుబంధ మిల్లర్ల అసోసియేషన్ అజమాయిషీ చేయడం మొదలయ్యింది. దీనితో ధాన్యం మిల్లింగు వ్యవహారంలో అసోసియేషన్లు ఆరోవేలుగా అవతరించాయి.

రికవరీలో కానరాని అసోసియేషన్లు

ధాన్యం కేటాయింపులో ఆధిపత్యం వహించే అసోసియేషన్లు ఎవరైనా సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వకపోతే, ఆ ధాన్యాన్ని లేదా దానికి సమానమైన డబ్బును రికవరీ చేయడంలో మాత్రం తమ బాధ్యత లేదన్నట్టు వ్యవహరిస్తున్నాయి. పైగా అసోసియేషన్లే ధాన్యం కేటాయింపులో గ్యారంటీగా సంతకం పెట్టినప్పటికీ.. రికవరీలో మాత్రం చేతులెత్తేసే విధానం స్పష్టంగా కనబడుతోంది.

ఇందుకు ప్రధాన కారణం అసోసియేషన్లను ఏలుతున్న బడా వ్యాపారులు, బియ్యం వ్యాపారులుగా అవతారం ఎత్తిన రాజకీయనేతలే ఎగవేత వెనుక ఉండటం. డీఫాల్టర్లుగా ప్రకటించిన మిల్లులన్నీ వీరి కనుసన్నల్లో, బినామీ వ్యక్తులతో నిర్వహిస్తూ ఉండటంతో రికవరీ విషయం వచ్చేసరికి అసోసియేషన్ ఏమాత్రం ముందుకు రావడం లేదు.

వాటి ఆధిపత్యం ఎందుకు?

ఏండ్లుగా రైస్ మిల్లుల నుంచి రూ.వేల కోట్ల విలువైన బియ్యం (సీఎంఆర్) రావాల్సి ఉంది. కానీ, వారి నుంచి రికవరీ చేయడం పౌరసరఫరాల సంస్థకు కనాకష్టంగా మారిం ది. పోనీ ధాన్యం కేటాయింపులో గ్యారంటీ సంతకం చేసిన మిల్లర్ల అసోసియేషన్ రికవరీలో బాధ్యత వహిస్తుందా అంటే అదీ లేదు.

మరి అలాంటి ఆసోసియేషన్లకు ఆధిపత్యం ఎందుకు ఇవ్వాలి? వాటి జోక్యాన్ని ఎందుకు కోరుకోవాలి? అనే అసంతృప్తి ఇటు పౌరసరఫరాల సంస్థలోనూ అటు రైస్ మిల్లర్లలోనూ కనపడుతోంది. కేవలం గ్యారంటీ సంతకం పెట్టి, ధాన్యం కేటాయించేందుకే అసోసియేషన్ రైస్ మిల్లుల నుంచి క్వింటాలుకు రూ.10 చొప్పున వసూలు చేస్తుందనే ఆరోపపణలుకూడా బలంగా వినపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ, ప్రభుత్వానికి.. రైస్ మిల్లులకు మధ్యన ధాన్యం కేటాయింపు, మిల్లింగు, సీఎంఆర్ అప్పగింత వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేని రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌కు ఆధిపత్యం వహించేలా అవకాశం ఇవ్వడం తప్పనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇప్పటికైనా ఈ నిబంధనను తొలగించాలని, పైగా గ్యారంటీగా సంతకం చేసినందుకు అసోసియేషన్లపై, వాటి ప్రతినిధులుగా చక్రం తిప్పుతున్న పెద్దలపై కేసులు నమోదు చేయాలనే అభిప్రాయంకూడా వ్యక్తమవుతోంది.  

డిఫాల్టర్ల జాబితాలో వెయ్యి రైస్ మిల్లులు 

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4500 మిల్లులు ఉన్నాయి. కొన్నేండ్లుగా ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మాయం చేసి, బహిరంగ మార్కెట్లో బియ్యాన్ని అమ్ముకున్న రైస్‌మిల్లులు సగటున ఒక్కో జిల్లాకు 20 నుంచి 30 వరకు ఉంటాయి. ఇలా సీఎంఆర్ ఇవ్వకుండా.. ధాన్యం నిల్వలు లేని రైస్ మిల్లులను పౌరసరఫరాల సంస్థ డిఫాల్టర్లుగా గుర్తిస్తుంది.

ఇలా డిఫాల్టర్లుగా గుర్తించిన రైస్ మిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 వరకు ఉంటాయని అంచనా. చిన్న మిల్లుల్లో బియ్యం రీసైక్లింగ్ చేయిస్తున్న బడా వ్యాపారులు చట్టం చేతికి చిక్కడం లేదు. దీనితో డిఫాల్టర్‌గా ప్రకటించిన రైస్ మిల్లుకు రెండేండ్ల పాటు ధాన్యం కేటాయించకుండా నిషేధం విధిస్తారు. మిల్లులను అమ్ముకుందామన్నా అసోసియేషన్ల బెదిరింపులు అడ్డుపడుతున్నాయి.

ఖమ్మం పౌరసరఫరా శాఖాధికారులపై వేటుకు సిద్ధం?

అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు

ఖమ్మం, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) రైస్ పక్కదారి పట్టడం, కోట్లాది రూ పాయల అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఖమ్మం జిల్లాలో జరిగిన అవినీతి ఆరోపణలపై ఇ ప్పటికే విచారణ పూర్తి చేసింది. సంబంధిత వ్యక్తులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం.

గత రబీ, ఖరీఫ్‌కు సంబంధించి రైతుల నుంచి ధాన్యం సేకర ణ చేసిన పిదప ధాన్యాన్ని తిరిగి ఇచ్చేందు కు జిల్లాలోని రైస్ మిల్లులకు వాటి సా మర్థ్యం మేరకు ధాన్యం కేటాయించారు. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, బియ్యాన్ని ప్ర భుత్వానికి అప్పగించాల్సిన బాధ్యత మిల్లర్లపై ఉంది. గత నెల 24న పౌరసరఫ రాశాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో కొన్ని మిల్లుల్లో కేటాయించిన ధాన్యం ని ల్వలు లేనట్టు గుర్తించారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు మిల్లులకు సంబంధించి సీఎంఆర్ అందజేత, ధాన్యం నిల్వలపై పౌర సరఫరా ల సంస్థ విచారణ జరిపింది. అధికారుల బాధ్యతలు, విధుల నిర్వహణపై స్థానిక సం స్ధల అదనపు కలెక్టర్ విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. బా ధ్యులపై త్వరలో చర్యలు చేపట్టేందుకు కలెక్టర్ సిద్ధమవుతున్నారు.

సీఎంఆర్ పక్కదారి పట్టించిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం, అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కలెక్టర్  సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. నివేదిక ప్రకారం మిల్లర్లకు సహకరించిన జిల్లా పౌరసరఫరా శాఖాధికారులపై సస్పెన్షన్ వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది.

ఒకటి రెండు రోజల్లో సంబంధిత శాఖలో పని చేస్తున్న ఇద్దరు ముగ్గురు అధికారులపై వేటు వేసే అవకాశం ఉందని సమాచారం. మూడు మిల్లులపై రెవిన్యూ రికవరీ యాక్ట్‌ను ప్రయోగించనున్నారు. మంగళగూడెం, కొణిజర్ల మండలంలోని రైస్ మిల్లర్లపై చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఇప్పటికే జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేతలతో కూడా చర్చలు జరిగాయని, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతి త్వరలో చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనున్నది.