calender_icon.png 23 February, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రకు సాక్ష్యం శ్యాంగఢ్

16-02-2025 12:00:00 AM

చారిత్రక కోటలు అనగానే చాలామందికి గోల్కొండ, వరంగల్ కోట మాత్రమే గుర్తుకువస్తాయి. కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి అయిన నిర్మల్‌లో సైతం ఆనాటి సైనిక స్థావరం, చెక్కు చెదరని గఢ్‌లెన్నో కళ్లముందు కదలాడుతాయి. అయితే ఇక్కడి గఢ్‌లోకెల్లా ప్రధానమైనది శ్యాంగఢ్. ఈ గఢ్‌లోకి అడుగుపెడితే చాలు.. పురాతన కట్టడాలు, అద్భుతమైన నిర్మాణాలు ఆకట్టుకుంటూ రా రమ్మని ఆహ్వానిస్తాయి. ఆనాటి పాలననూ గుర్తుకుతెస్తాయి.

ఓరుగల్లును కాకతీయులు కట్టినట్లే, నిర్మల్‌ను నిమ్మల పాలకులు నిర్మించారు. పట్టణం చుట్టూ సహజసిద్ధంగా ఉన్న గుట్టలు, అడవులను రక్షణ కవచాలుగా మలిచారు. వాటిని ఆధారంగా చేసుకుంటూ నిర్మల్ చుట్టూ గొలుసుకట్టు చెరువులను తవ్వించారు. ఈ చెరువులను అనుసరించి ఊరి చుట్టూ చైనాగోడను తలపించేలా ఇటుకలతో ప్రహరీ నిర్మించారు.

గోడకు ముందు లోతైన కందకాన్ని తవ్వించారు. వీటిలో నిండుగా నీళ్లు.. అందులో మొసళ్లు ఉండేవట. చుట్టూ ఉన్న గోడ మధ్యలో అక్కడక్కడ ఎత్తున బురుజులను నిర్మించారు. వాటిపై ఆయుధ సంపత్తి ఉంచేలా ఏర్పాటు చేశారు. ఇక ఊరిమధ్యలో గల గుట్టపై కోటను కట్టించారు.

నాలుగు వందల ఏళ్ల క్రితం నిర్మల్‌లో కోటలు, బురుజులు, రాజభవనాలున్నా యి. నిమ్మలనాయుడు రాజు పేరుతో నిర్మల్ ప్రాంతం ఏర్పడింది. నిర్మలత్వాన్ని నింపుకున్న నిర్మల్‌కు పరవశించి ఊరికి తన పేరే పెట్టాడు. నాటి నిమ్మల రాజ్యపు ఆనవాళ్లు నేటి నిర్మల్‌లో ఆకట్టుకుంటూనే ఉంటున్నాయి. 

ఒక్కో గఢ్‌కు ఒక్కో చరిత్ర 

నిర్మల్ అంటే గఢ్‌లకు ప్రసిద్ధి. అందులో ఒక్కో గఢ్‌కు, ఒక్కో చరిత్ర ఉంది. పట్టణానికి తూర్పున ఎత్తున గుట్టపై నిలువెత్తుగా ఉన్న బత్తీస్‌గఢ్ ఆ రోజుల్లో శత్రువుల గుండెలను దడదడలాడించింది. హిందీలో బత్తీస్ అంటే 32. ఈ గఢ్ ఒకదానికొకటి ఆనుకుని 32 గదులను నిర్మించారు. దీంతో దీనికి బత్తీస్‌గఢ్ అనే పేరొచ్చింది.

అప్పట్లో ఫ్రెంచ్ ఇంజినీర్ల సలహాలతో మట్టికోటగా ఉన్న బత్తీస్‌గఢ్‌ను డంగు సున్నం, ఇటుక, రాయితో బలమైన కోట నిర్మించారు. ఆనాటి పాలకులు ఎత్తున బురుజును నిర్మించి దానిపై ఫిరంగులను అమర్చారు. ఈ గఢ్‌లోనే మందుగుండు, ఆయుధాలు తయారుచేసేవారికి వసతి కల్పించారు.

శత్రువుల రక్షణ నుంచి ఎక్కువ గఢ్‌లను నిర్మించాడు. పట్టణానికి దక్షిణం వైపు సైన్యాన్ని ఉంచేందుకు విశాలమైన శ్యాంగఢ్‌ను నిర్మించారు. అప్పటి తన అశ్వ సైన్యాధిపతి పేరుమీదుగా దీనికి శ్యాంగఢ్‌గా పేరుపెట్టినట్లు చెపుతారు. పట్టణంలోకి ఎవరు రావాలన్నా ఈ గఢ్‌ను దాటుకునే రావాల్సి ఉంటుంది.

ప్రతి గఢ్‌పై ఫిరంగులు 

దీనికి ఓ వైపు కంచెరోని చెరువు ఉంది. చెరువుకు, గఢ్‌కు మధ్యలో నుంచే ప్రస్తుత 44వ నంబరు జాతీయరహదారి వెళ్తోంది. బంగల్పేట్ శివారులో ధం-ధంగఢ్, వెంకటాద్రిపేట్‌లో మ రోగఢ్, బత్తీస్‌గఢ్ పక్కనే వేంకటేశ్వర (ఏకశిలా) గఢ్ నిర్మించారు. పట్టణంతోపాటు మండలంలోని సోన్ సమీపంలో సోనగఢ్, చిట్యాలలో చి ట్టీగఢ్‌లు ఉన్నాయి.

బంగల్‌పేట్‌లో గల బంగల్ చెరువు కింది భాగంలో కందకం పొడవునా గఢ్‌లున్నాయి. ఇలా నిర్మల్, చుట్టుపక్కల కలిపి మొత్తం 64 గఢ్‌లను ఫ్రెంచ్ ఇంజినీర్ల సాయం తో నిర్మించిట్లు చరిత్ర చెబుతోంది.

ప్రతీగఢ్‌పై ఫిరంగులు, మందుగుండు సామగ్రి ఉండేవి. ఫిరంగులు పేలిస్తే వచ్చే వేడిని సైనికులు తట్టుకోవడానికి వాటిపక్కనే, వారు కూర్చునేందుకు నీటితొట్టిలను నిర్మించారు. ఇక ఈ గఢ్‌ల మరో ప్రత్యేకత ఏంటంటే.. ఒకదాని నుంచి మరోదానికి సొరంగ మార్గం ఉండటం. 

పర్యాటకంగా అభివృద్ధి చేయాలి

నిర్మల్‌లో సైనిక స్థావరం కోసం నిర్మించిన శ్యాంగఢ్ నేటికీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అందుకే దీనిపై నేను డాక్యుమెంటరీ తీసి ఈతరంవాళ్లకు తెలియజేసే ప్రయత్నంచేశా. అయితే పట్టణంలో  కోటలు, కొయ్యబొమ్మలు, గొలుసు చెరువులు ఎన్నో ఉన్నాయి. ఇవి అప్పటి చరిత్రను గుర్తుచేస్తున్నాయి. ఇలాంటి వారసత్వ సంపదను ప్రభుత్వమే రక్షించాలి.

 దొండి. శ్రీనివాస్, చరిత్ర పరిశోధకుడు, నిర్మల్