22-03-2025 07:38:23 PM
భద్రాచలం,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని కుటీర పరిశ్రమ నెలకొల్పుకొని వారి కుటుంబాన్ని పోషించుకోవడమే కాక పదిమందికి ఉపాధి కల్పించడం సంతోషకరమని, మార్కెట్ పరంగా వెసులుబాటు కల్పించుకొని ఆర్థికంగా లాభాల బాటలో నడవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. శనివారం భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని శ్రీ జయ దుర్గ సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామి దేవాలయం(Sri Jayadurga Sahitya Panchamukha Vishweshwara Swamy Temple) ఎదురుగా నెలకొల్పిన శ్రీ దుర్గా భవాని సెంట్రింగ్ యూనిట్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుద్యోగులైన గిరిజన యువతి, యువకులురూ 15 లక్షల సబ్సిడీతో రూ.25 లక్షల ఖర్చుతో శ్రీ దుర్గా భవాని సెంట్రింగ్ బ్రిక్స్ యూనిట్ ను గిరిజన యువతి యువకులు నెలకొల్పారన్నారు. దీంతో జీవనోపాధి పెంపొందించుకోవడం అభినందనీయం అన్నారు. యూనిట్ కాస్ట్, ఇటుకల తయారీ, మార్కెటింగ్ సౌకర్యం గురించి యూనిట్ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగులైన గిరిజన యువతి యువకులు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకొని ఆర్థికంగా ఎదగాలని, ఇక్కడ తయారు చేస్తున్న ఇటుకలు మార్కెటింగ్ సౌకర్యం కల్పించుకోవడానికి కాంట్రాక్టర్స్ తాపీ మేస్త్రీలతో సత్సంబంధాలు పెట్టుకొని సకాలంలో వారికి ఇటుకలు సరఫరా చేయాలని, దీనికి కావలసిన ముడి సామాన్లు సరసమైన ధరలకు కొనుగోలు చేసి మన్నికైన ఇటుకలు తయారు చేయాలని అన్నారు.
అలాగే బ్యాంకు ద్వారా తీసుకున్న రుణము ప్రతినెల సకాలంలో చెల్లిస్తే మరల యూనిట్ నడవడానికి అవసరానికి బ్యాంకు అధికారులు రుణాలు అందించడానికి మక్కువ చూపుతారని అన్నారు. అనంతరం సిమెంట్ ఇటుకలు తయారు చేసే మిషన్ మరియు సామాగ్రి పరిశీలించి, ఇటుకలు రవాణా చేసే వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏ టి డి ఓ అశోక్ కుమార్, జేడీఎం హరికృష్ణ, యూనిట్ సభ్యులు రాజు, వెంకటమ్మ, మహేశ్వరి, వెంకటమ్మ, నాగరాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.