calender_icon.png 30 October, 2024 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీపావళి వేడుకలకు ముస్తాబైన శ్రీ మహాశక్తి దేవాలయము

30-10-2024 01:18:56 PM

సమస్త భక్తులకు కొంగుబంగారంగా మారిన శ్రీ మహాశక్తి దేవాలయ శ్రీ మహాలక్ష్మి..

మహిమాన్విత దివ్య క్షేత్రంలో అష్ట ఐశ్వర్య ప్రదాయిని గా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు..

కరీంనగర్ (విజయక్రాంతి): భారతీయ సంస్కృతికి అద్దం పట్టే దీపావళి పండుగ వేడుకల కోసం కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. మహిమాన్విత దివ్య క్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు కొంగు బంగారంగా మారింది. విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా, అష్ట ఐశ్వర్య ప్రదాయినిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ప్రసిద్ధికెక్కింది. శ్రీ శ్రీ శ్రీ విరూపాక్ష హంపి జగద్గురు  శంకరాచార్య దివ్య ఆశీస్సులతో శ్రీ మహాశక్తి దేవాలయంలో దీపావళి మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఆలయనిర్వాకులు తగిన ఏర్పాట్లు చేశారు.

మంగళవారం రోజు నుండి దీపావళి మహోత్సవ వేడుకలు ప్రారంభమైన నేపథ్యంలో దేవాలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలు, పూల అలంకరణతో కనువిందు చేసేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సాయంత్రం వేళ అమ్మవార్లకు నాణేలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. 30వ తేదీ ధన త్రయోదశి సందర్భంగా సాయంత్రం 6:30 గంటలకు అమ్మవార్లకు ఫల పంచామృతం, మంగళ ద్రవ్యాభిషేక కార్యక్రమాలు, 31 గురువారం రోజున నరక చతుర్దశి, దీపావళి పండగ సందర్భంగా ఉదయం ఉదయం ఏడు గంటలకు అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ, మహా హారతి,  నవంబర్ ఒకటో తేదీ శుక్రవారం రోజున ఉదయం 9 గంటలకు లక్ష్మీ కుబేర హోమము, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలను చేపట్టనున్నారు.

హిందూ సంస్కృతికి అద్దం పట్టే దీపావళి పండుగను ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్థి గానూ, అమావాస్యను దీపావళి పుణ్యదినంగా జరుపుకుంటున్నామని, ఈ రోజున శ్రీ మహాలక్ష్మి పూజ జరిపి, రాక్షసుల బాధలు తొలగిన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి దీపాలంకరణ చేసి బాణాసంచా కాలుస్తున్నామని, సకల సంపదలకు నిలయమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని నిష్టతో పూజించే వారికి సిరి సంపదలు సుఖసంతోషాలు చేకూరుతాయని ఆలయ పండితులు తెలిపారు. దీపావళి పండుగనాడు శ్రీ మహాశక్తి దేవాలయ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించి అనుగ్రహం పొందగలరని  ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.