calender_icon.png 3 March, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్‌ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌కుమార్‌కు చుక్కెదురు

02-03-2025 12:52:35 AM

ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు 

హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మీడియా ప్రతినిధి శ్రవణ్‌కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. శ్రవణ్‌కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ కే సుజన తీర్పు వెలువరిస్తూ కేసు తీవ్రత, నిందితుడి ప్రవర్తన ఆధారంగా పరిశీలిస్తే ముందస్తు బెయిల్‌కు అర్హతలేదని పేర్కొన్నారు.

నేరంలో పాల్గొనలేదని శ్రవణ్‌కుమార్ పేర్కొంటున్నప్పటికీ చాలా కాలంగా పరారీలో ఉన్నాడని, అతడి ఇంటి నుంచి దర్యాప్తు అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారని, దీనిపై దర్యాప్తు పెండింగ్‌లో ఉందని, అందువల్ల కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందన్నారు.   అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే పిటిషనర్ అనారోగ్యంతో ఉన్న సోదరిని పరామర్శించడానికి విదేశాలకు వెళ్లారన్నారు.

కేవలం నిందితులుగా ఉన్న అధికారులను కలిశారన్న కారణంగా కేసులో ఇరికించారన్నారు. నేరంతో ఎలాంటి సంబంధంలేదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ ఇక్కడ కేసులో మొదటి అరెస్ట్ జరిగిన రోజే దేశం విడిచి వెళ్లిపోయారన్నారు. మరో నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే పిటిషనర్‌ను నిందితుడిగా చేర్చామ న్నారు. దేశ భద్రతకు సంబంధించి సమాచారాన్ని ధ్వంసం చేశారని, ఇది కుట్రలో భాగమన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ శ్రవణ్‌కుమార్ పిటిషన్‌ను కొట్టివేశారు.