calender_icon.png 2 February, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌పై వరాల జల్లు

02-02-2025 12:00:00 AM

  1. ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు
  2. వెస్టర్న్ కోసి కెనాల్‌కు ఆర్థిక సాయం
  3. ఐఐటీ పట్నా సామర్థ్యం పెంపు
  4. అసెంబ్లీ ఎన్నికల కోసమేనన్న ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో మరోమారు బీహార్‌కు అధికంగా నిధులు కేటాయించారు.  కేంద్రంలో ఎన్డీయే కూటమిలో బీహార్‌ను పాలిస్తున్న నితీశ్ కుమార్ పార్టీ కీలకభాగస్వామిగా ఉండడం, ఈ ఏడాది చివర్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం వల్లే బీహార్‌కు వరాల జల్లు కురిపించారని అంతా అంటున్నారు.

ఆ రాష్ట్రంలో “మఖానా” బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ఈ బోర్డు ద్వారా స్థానికంగా మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగవనున్నాయి. ఈ బోర్డు ద్వారా రైతులకు శిక్షణ అందించనున్నారు. ఈ ఏడాది చివర్లలో బీహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేంద్రం ఏకపక్ష కేటాయింపులు చేసిందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

బీహార్‌పై జల్లు కురిసిందిలా.. 

కేవలం మఖానా బోర్డు మాత్రమే బీహార్‌కు కేటాయించలే దు. బడ్జెట్‌లో సింహభాగం కేటాయింపులు బీహార్‌కే జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. 

* బీహార్‌లోని వెస్టర్న్ కోసి కెనాల్‌కు ఆర్థిక సాయం.. ఈ కెనాల్ ద్వారా మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూరనుంది. 

* అంతే కాక ఐఐటీ పట్నాపై కూడా వరాల జల్లు. పెరగనున్న ఐఐటీ పట్నా సామర్థ్యం. 

* రాబోయే పదేండ్లలో దేశవ్యాప్తంగా 4 కోట్ల మందిని విమానమెక్కించాలని చూస్తున్న కేంద్రం.. బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. 

* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ ను అక్కడ ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. 

జూలైలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కూడా ఇలాగే కేంద్రం బీహార్‌పై వరాల జల్లు కురిపించింది. బీహార్‌ను ఏలుతున్న నితీశ్ కుమార్ పార్టీ పొత్త చాలా కీలకం కావడంతోనే ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్రం ఇలా చేస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.