08-03-2025 11:13:13 PM
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు...
ఇన్స్ పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు సోలంకి రవళి..
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటాలని (ఐ.ఎస్.ఆర్.డి) స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు సోలంకి రవళి అన్నారు. శనివారం ఐఎస్ఆర్డి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి బాపులే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహం, జంగంపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎస్.ఆర్.డి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు సోలంకి రవళి మాట్లాడుతూ... స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటాలని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలను ఆదర్శంగా తీసుకుని కృషి చేయాలని సూచించారు.
రేపటి తరం భవిష్యత్‌ను తీర్చిదిద్దే శక్తి మాతృమూర్తులకే ఉంటుందని, బాలిక విద్య కుటుంబం, దేశ పురోగతికి పునాది వంటిదని వివరించారు. సమాజంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, భారతదేశం స్త్రీను పూజించే దేశంగా నిలుస్తోందని, అయితే మహిళలు చదువుకునే సమయంలో ఎదురయ్యే వేధింపులను ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉండాలని సూచించారు. "సృష్టికి ప్రతి సృష్టి ఒక స్త్రీ చేయగలదు" అంటూ మహిళల మేలిమి సామర్థ్యాన్ని వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజూ జరుపుకోవాలంటూ విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విమల, శ్రీలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.