21-02-2025 08:42:52 PM
మునుగోడు మండల కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠీ..
మునుగోడు (విజయక్రాంతి): బీసీ బాలుర హాస్టల్ వార్డెన్, కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారి సమయపాలన పాటించకపోవడంతో పాటు సమాచారం ఇవ్వకుండా వెళ్లడంతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్, కస్తూర్బా పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తాహసీల్దార్ కార్యాలయమును ఆకస్మిక తనిఖీ చేశారు. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యా విధానంపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
బోధించే సమయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఉన్నతమైన స్థాయికి ఎదిగేందుకు పట్టుదలతో విద్యార్థులు వివిధ రంగలలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను తనిఖీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు. ఈ కార్యక్రమంలో చండూర్ ఆర్డీవో శ్రీదేవి, తాహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో శాంతి కుమారి, ఆర్ఐ నాగరాజ్ ఉన్నారు.