calender_icon.png 18 April, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యామ్నాయం చూపించండి

13-12-2024 12:28:55 AM

  1. ఎయిర్ పోర్టు ట్రిప్స్ బాయ్‌కాట్ క్యాంపెయిన్‌లో క్యాబ్ డ్రైవర్లు
  2. ఓలా, ఊబర్, ర్యాపిడోల రాకతో ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన
  3. ప్రభుత్వమే ప్రత్యేక యాప్ రూపొందించాలని వినతి
  4. యూనిఫామిక్ ఫెయిర్‌ను నిర్ణయించాలని డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి అగ్రి గేటర్ సంస్థల రాకతో క్రమేపీ జీవనోపాధికి దూరమవుతున్న ఇతర క్యాబ్ డ్రైవర్లు సమ్మెబాట పట్టారు.

జీవనోపాధి కోసం నడుపు కుంటున్న క్యాబ్‌లు అగ్రిగేటర్ సం స్థల పోటీకి తట్టుకోలేక కుటుంబ పోషణ భారం గా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిగేటెర్ కంపెనీలు నిర్ణయించే అతి తక్కువ ధరల కారణంగా మా ఉపాధి కుదేలవుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టు ట్రిప్‌లు బాయ్‌కాట్ చేసేందుకు క్యాబ్ డ్రైవర్లు సిద్ధం అవుతున్నారు.

ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ డిమాండ్ చేస్తున్నారు. 

జీవనోపాధి కోల్పోతున్నాం...

హైదరాబాద్ నగరం నుంచి దాదాపు 30 నుంచి 35 కిలోమీటర్లు దూరంలో ఉండే  శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ట్రావెల్స్ నుంచి ఓ క్యాబ్‌ను కిలో మీటర్ లేదా 4 గంటలు, 8 గంటల చొప్పున బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రకారం సుమారు రూ.1,000 నుంచి రూ. 1,200 చార్జ్ అవుతుంది. అయితే ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థలు రంగంలోకి దిగిన తర్వాత కేవలం రూ.400 నుంచి రూ. 500కి మాత్రమే ట్రిప్ పడుతోంది.

ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీసులు మార్కెట్‌లోకి రాని సమయంలో.. లక్షలు పోసి కార్లు కొని.. క్యాబ్ సర్వీసులతో జీవనోపాధి పొందిన డ్రైవర్లు, ఓలా, ఊబర్ రాకతో ఒక్కసారిగా ఆదాయం తగ్గిపోవడంతో పాటు ట్రిప్పులు పడిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ఓలా, ఊబర్, ర్యాపిడో సర్వీసుల్లోనూ వచ్చే పికప్ రేటులో 30శాతం కమిషన్ రూపంలో పోతుండటంతో ఆ కంపెనీ అండర్‌లో నడిపే క్యాబ్ డ్రైవర్ల ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటోందనే వాదన కూడా లేకపోలేదు.

ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూపించాలి

క్యాబ్‌లు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్న తామంతా.. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థల రాకతో ఉపాధి కల్పోతున్నామని క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏయిర్‌పోర్టుకు సాధారణ ధరలకు, రాయితీల పేరుతో కంపెనీలు అందిస్తున్న క్యాబ్ ట్రిప్ ధరలకు తీవ్రమైన వ్యత్యాసం ఉండటంతో సాధారణ క్యాబ్‌లకు అసలు గిరాకీ లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఓలా, ఊబర్ వంటి కంపెనీలు నడిపే క్యాబ్‌ల ప్రతి రైడ్‌లో 30 శాతం కమిషన్ పోతున్న కారణంగా ఆయా క్యాబ్‌లు నడిపే  డ్రైవర్లు కూడా సంతృప్తిగా లేరని అన్నారు. ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు, ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ డిమాండ్ చేస్తున్నారు.

అలాగే హైదరాబాద్ నగరంలో అన్నిరకాల క్యాబ్‌లకు ఒకేరకమైన ధరలు ఉండేలా నియంత్రణ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిరోజులుగా ఏయిర్‌పోర్టు ట్రిప్ బాయ్‌కాట్ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడోలతో పాటు దాదాపు 10వేల క్యాబ్ డ్రైవర్లు ఎయిర్‌పోర్టు ట్రిప్ బాయ్‌కాట్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో  ఏయిర్‌పోర్టు వద్ద గురువారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

యూనిఫామిక్ ధరలను నిర్ణయించాలి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి క్యాబ్ డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ప్రత్యేక యాప్ రూపొందిస్తుందని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఆ దిశగా ఎలాం టి చర్యలు తీసుకోలేదు.

సీఎం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ యాప్‌ను తయారు చేయాలి. అందుకు అనుగుణంగా యూనిఫామిక్ (సమానమైన) ధరలను నిర్ణయించాలి. ప్రభుత్వం సాధారణ క్యాబ్ డ్రైవర్ల సమస్యలను మానవీయం కోణంలో చూసి వెంటనే ప్రత్యేక పాలసీ రూపొందించాలి. 

 షేక్ సలావుద్దీన్, తెలంగాణ 

గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు