calender_icon.png 16 January, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా మొరవినండి!

29-10-2024 12:00:00 AM

పోలీసు కుటుంబాలు రోడ్డు ఎక్కాయి.. తమ బాధలను, గాథలను తోచిన రీతిలో వ్యక్తపరుస్తున్నారు. భార్యా, పిల్లలకు దూరం చేస్తున్న స్పెషల్ పోలీసు విధివిధానాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ కుటుంబాల ఆవేదనలు, ఆందోళనలను అర్థం చేసుకోలేని పాలకులు వాళ్లపై కఠిన చర్యలకు ఉపక్రమించింది.

బెటాలియన్ పోలీసు కుటుంబాలు ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఒక్కటే..‘ఏక్ పోలీస్’ విధానాన్ని అమలు చేయమని. ఈ విధానం మన దేశంలో కొత్తదేమీ కాదు. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో అమల్లో ఉన్నది. ఈ విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలనేదే పోలీసు కుటుంబాల ప్రధాన డిమాండ్.

గత వారం రోజులుగా చేస్తున్న ఆందోళనల వెనుక ఏదో రాజకీయ కోణాన్ని మాత్రమే వెతుకున్నారు ఉన్నతాధికారులు. కానీ వారి ఆందోళన వెనుక ఆవేదనే తప్ప ఏ దురుద్దేశం లేదని కానిస్టేబుల్ భార్యలు విలపిలస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయక్రాంతి పలువురు కానిస్టేబుళ్ల భార్యలను పలుకరించింది..

మా బాధలు వర్ణనాతీతం

‘మా పరిస్థితి చాలా దరిద్రం. చెప్పుకోవడానికి కూడా వీలుండదు. నా భార్య డెలివరీ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. మొదటి పాప డెలివరీ సమయలో.. మా సర్ ఫోన్ చేసి.. ఇప్పుడంటే ఇప్పుడే డ్యూటీకి రావాలని సతయించిండ్రు. రెండో బాబుకు మూడు రోజుల్లో డెలివరీ ఉందంటే.. ఆక్సిజన్ ట్యాంకర్లు తీసుకురావాలని ఆర్‌ఐ వెంట ఒడిస్సా పం పించారు.

డ్యూటీ చూసుకొని వచ్చే సమయానికి కొవిడ్ పాజిటివ్‌తో వచ్చా.. కనీసం నా బాబు దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి. సర్ నాకు కొత్తగా పెళ్లుయిందంటే.. కొత్తగా పెళ్లి అయితే పెళ్లం దగ్గరే పడుకుంటావా? అని ఘోరంగా మాట్లాడు తారు. ఇవన్నీ భరించలేక.. మా భార్య లు బయటకు వస్తే.. మమ్మల్ని త్రి లెవల్ యాక్ట్ ప్రకారం తొలగిస్తం అని భయపడెతున్నారు. 

 ఓ పోలీసు ఆవేదన

పిల్లలకు తండ్రి ప్రేమే లేదు..

మా పిల్లలకు తండ్రి ప్రేమ, ఆప్యాయతలు లేవు. వాళ్లతో కనీసం ఒక మూడు రోజుల సమయం గడపలేని పరిస్థితి. ఇంట్లో పెద్దవాళ్లకు, పిల్లలకు ఏమైనా మేమే చూసుకోవాలి. పేరుకు గవర్నమెంట్ ఉద్యోగం.. కానీ మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి. భర్త ఉన్న ఒక సింగిల్ పేరెంట్‌గా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని మా సమస్యలు అర్థం చేసుకొని పరిష్కరించాలి.   

 శ్రీజ, వరంగల్

నా డెలివరీ సమయంలో..

మా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. నా డెలివరీకి వారం ముందు నుంచి మా ఆయన సెలవుకు రిక్వెస్ట్ పెడితే.. కనీ సం కనికరించకుండా దూరంగా డ్యూటీకి పంపించారు. మా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంటి సమస్యలను ఎవరితో చెప్పుకోవాలి. డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాక కూడా ఇంట్లో వాళ్లతో హ్యాపీగా ఉండలేకపోతున్నారు.

డ్యూటీకి ఒక సమయం అంటూ లేదు. ఏ టైమ్‌లో ఫోన్ కాల్ వస్తే ఆ టైమ్‌కు వెళ్లిపోవాల్సిందే! అధికారులు పెట్టే ఒత్తిడి భరించలేక డిప్రెషన్‌కు గురై..  ఇంట్లో పిల్లలతో కూడా ఆనందంగా ఉండలేకపోతున్నారు. ఎప్పుడూ చూసిన చికాకుగా, కోపంగా ఉంటారు. ఇంట్లో జరిగే ఫంక్షన్స్‌కు, పెళ్లిళ్లకు, కనీసం చావులకు కూడా రాలేని పరిస్థితి.   

ఎన్. రీనా ఎస్తేరు, వనపర్తి 

నాలుగేండ్లల్లో.. 40 రోజులు కూడా లేరు!

నాకు పెళ్లుయి నాలుగేళ్లు గడుస్తున్నది. కానీ మా హస్బెండ్ నాతో కనీసం 40 రోజులు కూడా ఉండలేదు. కేవలం డ్యూటీస్ కారణంగా మాకు ఇప్పటీ వరకు పిల్లలు కూడా కాలేదు. మా ఫ్యామిలీని చూసుకోవడానికి మా ఆయనకు ఎప్పుడూ టైమ్ దొరకదు. ఇంట్లో ఫంక్షన్స్, హాస్పిటల్స్ ఏమైనా నేనే చూసుకోవాలి. మా ఆయన ఉన్న కూడా ఒంటరి జీవితమే.

‘మా బాధలు బయటకు చెప్పుకోలేక.. మాలో మేం చచ్చిపోతున్నాం’. నిజానికి ఎలక్షన్స్ కంటే ముందే సీఎం గారు ‘ఏక్ పోలీస్’ విధానం తీసుకోస్తమని హామీ ఇచ్చారు. దయచేసి అది అమలు చేయండి. మొన్న మనందరం చూశాం.. ఒక్క కుమారీ ఆంటీకి ప్రాబ్లమ్ వస్తే సీఎంగారు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించారు. మరీ వ్యవస్థనే కాపాడే పోలీ సు వాళ్ల కుటుంబాలకు ఎందుకు సపోర్టు చేయడం లేదో అర్థం కావడం లేదు. 

 నందిని, నల్గొండ జిల్లా

మాకు దిక్కెవరూ!

ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్న మేం.. ఇప్పుడు ఆందోళనకు దిగామంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోండి. మా బాధలను ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి వస్తే.. మమ్మ ల్ని, మా కుటుంబాలను దోషులుగా అరెస్టులు చేస్తున్నారు. మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ని మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నాం. మా వెనుకల ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు.

మా అందర్ని మీ సోదరిమణు, కూతుళ్లుగా అర్థం చేసుకుంటారని అడగడానికి ముందుకు వచ్చాం. దయచేసి మా భర్తలను సస్పెండ్ చేసి మా కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయకండి. మీరు నిర్వహిస్తున్న దర్బార్‌లో ఉన్నత అధికారులు మా బాధల ను మీవరకు చేరనివ్వరు. అదే మా ఆవేదన. ఎందుకంటే మా వారితో అన్నిరకాల వెట్టిచాకిరి పనులు చేయించుకోవడమే వాళ్ల లక్ష్యం.

మా భర్తలను ఆర్మివాళ్లతో పోల్చుతున్నారు కదా ప్రజలు.. ఆర్మివాళ్లకు ప్రత్యేకమైన వైద్య, విద్య సదుపాయా లు ఉంటాయి. వాటిని మాకు అమలు చేయండి. మా భర్తలు రాష్ట్రానికి సర్వీసు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఉద్యోగంలో చేయించుకోవాల్సిన పనులు మాత్రమే చేయిం చుకోండి.

మేం చేసే ధర్నాకు, రాజకీయ నాయకులకు, పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. ఒక విధంగా ‘మేం భర్త ఉన్నా లేనట్టుగా.. మా పిల్లలూ తండ్రి ఉన్న అనాథలుగా బతుకుతున్నారు’. ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకుంటే బాగుంటుంది. 

 అంజలి, నాగర్‌కర్నూల్