06-03-2025 12:18:31 AM
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): రైతుల నుంచి భూమిని తీసుకుని 15 ఏండ్లు గడిచిపోయినా, భూ యజమానులైన రైతులు వీధిన పడ్డా, పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించినా అధికారుల్లో చలనం లేకపోవడంపై బుధవారం హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువకు సమాంతర కాలువ నిర్మాణం తవ్వేందుకు రైతుల నుంచి భూమిని స్వాధీనం చేసుకుని ఇప్పటికీ 15 ఏళ్లయినా పరిహారం ఎందుకు చెల్లించలేదని ఉన్నతాధికారులను ప్రశ్నించింది. కోర్టు ఆదేశించిన తర్వాత కూడా రైతులకు ఎందుకు పరిహారం చెల్లించలేదని నిలదీసింది.
పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేయాలని 2024 సెప్టెంబర్‌లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో స్వయంగా కోర్టుకు వచ్చి చెప్పాలని ముగ్గురు ఐఏఎస్ అధికారులు.. నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కే రామకృష్ణారావు, వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి భూసేకరణ అధికారి డీ సుబ్రహ్మణ్యంలకు కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది.
తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ఇటీవల ఉత్తర్వులను జారీ చేశారు. కోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీల్ కూడా దాఖలు చేయలేదని, మరోవైపు కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణ చర్యలకు తెరతీసిందన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.