23-03-2025 12:00:00 AM
వేసవికాలం వచ్చిందంటే విహారయత్రలకు వెళ్లేందుకు చాలామంది ప్లాన్ చేస్తుంటారు. దట్టమైన మంచు కురుస్తుంటే.. భూమి ఓ తెల్లటి దుప్పటిలాగ కనిపించే సుందర ప్రదేశాల్లో విహరించాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇలాంటి సుందరమైన ప్రకృతి దృశ్యాలు కేవలం వేసవికాలంలోనే కనువిందు చేస్తాయి.
అందుకే టూర్లు వేయడానికి, యాత్రలు చేయడానికి సమ్మర్ హాలీడ్ అనువైనవిగా భావిస్తుంటారు. ఈ కాలంలో చూడదగిన ప్రదేశాలు ఏమేం ఉన్నాయి? వాటి ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..
కొండలు, జలపాతాలు, గిరిజన సంస్కృతి, చల్లని వాతావరణంతో ఆంధ్రా ఊటీగా అరకు లోయలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ లోయలో పర్యాటకులు ట్రెక్కింగ్, క్యాంపింగ్, జిప్ లైనింగ్ వంటి ఎన్నో సాహస కార్యకలాపాలను ఎంజాయ్ చేస్తారు. అరకు పర్యటనకు వెళ్లి.. రైలు ప్రయాణం చేయకపోతే మాత్రం ఓ మంచి అనుభూతిని మిస్ అయినట్లే.
ఎందుకంటే జలపాతాల పక్కన, పదుల సంఖ్యలో ఉండే సొరంగాల గుండా సాగే ఈ ప్రయాణం.. రోడ్డు మార్గం కన్నా ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది. అరకు పక్కనే బొర్రాకేవ్స్ ఉంటాయి. వందల ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ సున్నపురాయి గుహలు సుమారు 100 అడుగుల లోతు, కిలోమీటర్ మేర విస్తరించి..
పర్యటకులను బాగా ఆకట్టుకుంటాయి. అక్కడి నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కటిక వాటర్ ఫాల్స్‌ను చూడొచ్చు. అందమైన పల్లెటూళ్ల మధ్య పెద్ద బండలపై నుంచి కిందకు జాలువారే తాటికూడి జలపాతం కూడా బాగుంటుంది.
భూతల స్వర్గం కేరళ
‘గాడ్స్ ఓన్ కంట్రీ’ గా పేరొందిన కేరళలో టూర్ ఎంతో మనోహరంగా ఉంటుంది. ఇక్కడ చూడచక్కని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో మున్నారు ఒకటి. సముద్రమట్టానికి దాదాపు 1600 మీటర్ల ఎత్తులో ఉండే మున్నార్ హిల్ స్టేషన్‌ను వీక్షించడానికి ప్రతి సంవత్సరం చాలామంది పర్యటకులు వస్తుంటారు. ఇక్కడ తేయాకు తోటల అంతులేని అందాలు సందర్శకులను కనువిందు చేస్తాయి.
గతంలో ఈ ప్రాంతం రొమాన్స్‌కు ఉత్తమ గమ్యస్థానం. నిత్యం పచ్చదనంతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతం జలపాతాలకు సైతం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ పర్వతాల్లో కనువిందు పొగమంచు కూడా రమణీయంగా ఉంటుంది. చల్లని గాలి, బంగారు వర్ణంతో మెరిసే ఇసుక, ఎత్తున కొబ్బరి చెట్లతో స్వర్గాన్ని తలపించే కోవలం ప్రదేశం సైతం టూర్‌కు ఎంతో బాగుంటుంది.