22-12-2024 03:22:13 AM
గజ్వేల్‌లో రాజీవ్ రహదారి, ఆమనగల్ శ్రీశైలం రోడ్డుకూ..
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): గత ప్రభుత్వం రాళ్లు, రప్పలు, గుట్ట లు, పుట్టలకు రైతుబంధు ఇచ్చిందని, ఆఖరికి రహదారులకు కూడా రైతుబంధును ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. క్రషర్లకు, రియల్ ఎస్టేట్ భూములకు, లేఅవుట్లకు కూడా రైతుబంధు కింద నిధులిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం పదేళ్లలో రూ.72,817 కోట్లు రైతు బంధు రూపంలో ఖర్చుచేస్తే, అందులో దాదాపు రూ.22 వేల కోట్లు అనర్హులకు ఆయాచిత లబ్ధి చేకూర్చారని మండిపడ్డారు. శాసనసభలో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతు భరోసాను తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిందన్నా రు.
రైతు భరోసాపై నిర్ణయాల్లో ప్రధాన ప్రతిపక్షం సలహాలు తీసుకుని విధివిధానాలను ముందుకు తీసుకెళ్లాలని తాము భావిస్తున్నామని చెప్పారు. రైతు భరోసా.. రైతులను ఆదుకునేందుకేనన్నారు. రైతు భరోసా అమ లు విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, దాన్ని పారదర్శకంగా చేపడతామని తెలిపారు. రైతులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ఎప్పు డూ ముందుంటుందని పేర్కొన్నారు. రైతులను ఆదుకోవాలనేదే తమ ఆలోచన అని అన్నారు.
నకిలీ పట్టాలకు కూడా..
గత ప్రభుత్వం పదేళ్లలో రూ.72,817 కోట్లు రైతు బంధు రూపంలో ఖర్చు చేసిందని, అయి తే సాగులో లేని భూములకు, గుట్టలు, లే-అవుట్లకు, నేషనల్ హైవేస్‌కు కూడా రైతు బంధు ఇచ్చారని సీఎం మండిపడ్డారు. రూ. 72,817 కోట్లలో దాదాపు రూ. 22 వేల 606 కోట్లు అనర్హులకు ఇచ్చారని వివరించారు. ఇప్పుడు కూడా రాళ్లకు, గుట్టలకు, రహదారులకు రైతు భరోసా ఇద్దామా అన్నారు.
గతంలో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ రహదారికి, రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్లకు కూడా రైతుబంధు ఇచ్చారని తెలిపారు. క్రషర్ యూనిట్లకు, మైనింగ్ భూములకు కూ డా రైతుబంధు ఇచ్చారని పేర్కొన్నారు. వాళ్ల అనుయాయులు కొందరు నకిలీ పట్టాలతో కూడా రైతుబంధు పొందారని పేర్కొన్నారు.
వేలాది కోట్లు కొల్లగొట్టారు..
హైదరాబాద్ చుట్టుపక్కల 50 కి.మీ పరిధి లో 70 నుంచి 80 శాతం వ్యవసాయం చేయడం లేదని, కానీ గతంలో హైదరాబాద్ చుట్టు పక్కల 3 కోట్ల ఎకరాలకు డబ్బులు ఇచ్చుకుం టూ వెళ్లారని సీఎం తెలిపారు. 80 వేల పుస్తకాలు చదివిన మేథస్సుతో రైతు భరోసాపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సూచనలు ఇస్తారని తాము భావించామని, కానీ ఆయన సభ కు రావడంలేదన్నారు.
వాళ్లు ఇచ్చారు కాబట్టి మమ్మల్ని కూడా గుట్టలు, రియల్‌ఎస్టేట్ వాళ్లందరికీ ఇవ్వాలని కేటీఆర్ అంటున్నారని తెలిపారు. వాళ్లు ఇచ్చినట్లు తామూ ఇస్తే మేం ప్రతిపక్షంలో ఉంటామన్నారు.
వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలా?..
తాము వాళ్లను ఆదర్శంగా తీసుకోమంటున్నారని, వాళ్లను ఆదర్శంగా తీసుకుంటే వాళ్ల లాగే తాము అధికారపక్షంలో ఉండమని సీఎం అన్నారు. రైతు సంక్షేమమే తమకు ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. సభలోకి వస్తే సమాజం ముందు తల దిం చుకోవాల్సి వస్తుందనే ఆలోచనతో ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదేమో నని ఎద్దేవా చేశారు.
ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానం..
2019లో తాను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్‌లో రైతు ఆత్మహత్యలపై అడిగిన ప్రశ్నకు నాడు సభలో సమాధానం ఇచ్చారని, అయితే ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. 2014, 2015, 2016కు సంబంధించి రైతు ఆత్మహత్యల వివరాలను ఆయన సభలో వెల్లడించారు.
ఏపీలో 2014లో 160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, 2015లో 516 మంది, 2016లో 239 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సీఎం తెలిపారు. మహారాష్ర్టలో దేశంలోనే అత్యధికంగా 2014లో 2568 మంది, 2015లో 3030 మంది, 2016లో 2550 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇక బీఆర్‌ఎస్ హ యాంలో తెలంగాణ రాష్ట్రం రైతు ఆత్మహత్య ల్లో రెండో స్థానంలో నిలిచిందన్నారు.
తెలంగాణలో 2014లో 898 మంది, 2015లో 1358 మంది, 2016లో 632 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. మనకంటే అత్య ధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని ఆత్మహత్యలు జరగలేదన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో 2014లో 63 మంది, 2015లో 145 మం ది, 2016లో 69 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
తెలంగాణ ధనిక రాష్ర్టం, మిగు లు రాష్ర్టంలో ఇన్ని ఆత్మహత్యలు జరగడం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్ వాళ్లు తలదించుకు ని రైతులకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిన రుణమాఫీ రూ.27 వేల కోట్లే..
రైతులకు వాస్తవాలు తెలుసు కాబట్టే వాళ్ల కు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారని ఆయన విమర్శించారు. 2014లో లక్ష రుణమాఫీ చేస్తామన్నారని పేర్కొన్నారు. ఐదేళ్లలో రూ.లక్ష రుణమాఫీకి వాళ్లు ఖర్చు చేసింది రూ.16,143 కోట్లు.. అది కేవలం మిత్తికే సరిపోయిందన్నా రు.
రెండోసారి అధికారంలోకి వచ్చాక వీళ్లు చేసిన రుణమాఫీ రూ.11, 909 కోట్ల 31 లక్షలు మాత్రమే అన్నారు. ఇందులోనూ రూ.8,515 కోట్లు మిత్తికే సరిపోయిందని, బీఆర్‌ఎస్ చేసిన రుణమాఫీ కేవలం రూ.3384 కోట్లు మాత్రమే నని అన్నారు. ఇలా పదేళ్లలో వారు చేసిన రుణమాఫీ కేవలం రూ.27వేల కోట్లు మాత్రమే అన్నారు.
27 రోజుల్లో 20,616 కోట్లు మాఫీ ..
తమ ప్రభుత్వం వచ్చిన 27 రోజుల్లో దేశం లో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాదిలోనే 25,35,963 మంది రైతులకు రూ.20,616 కోట్లు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నామని సీఎం చెప్పారు. ఇది తమ గొప్పతనం గా మేం అనుకోవడంలేదని.. ఇది మా బాధ్యతగా భావిస్తున్నామన్నారు.
రైతు రుణమాఫీకి 11.12.2018 నుంచి 9.12.2023 ఐదేళ్ల మధ్య రైతుల లోన్స్ మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని సీఎం చెప్పారు. వాళ్లు ఎగ్గొట్టినవి, బకాయిలు పెట్టినవి తాము పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఆనాడు రైతులకు ఇవ్వడానికి 8 వేల కోట్లు కూడా లేవని చెప్పి ఇప్పుడు రైతుల కోసమే బతుకుతున్నట్టు వాళ్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇలా బాధ్యత లేకుం డా మాట్లాడటం సమంజసమేనా? అన్నారు. మాట తప్పని, మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఆనాడు కేసీఆర్ లోక్‌సభలో లేకపోయినా తెలంగాణ రాష్ర్టం ఇచ్చిన గొప్ప నాయ కురాలు సోనియా గాంధీ అన్నారు. సోనియా దగ్గరికి వెళ్లి బొక్కబోర్ల కాళ్లపై పడిన సంగతి వాళ్లు మరిచిపోయారని, కృతజ్ఞతలేని మనుషులు బీఆర్‌ఎస్ నాయకులని అన్నారు.
రూ.100 కోట్లు అదానీకి తిరిగిచ్చేశాం..
స్కిల్ వర్సిటీ కోసం అదానీ రూ.100 కోట్లు ఇస్తే దానిపై ప్రతిపక్షం నానాయాగీ చేసిందని సీఎం తెలిపారు. ఆ మొత్తాన్ని తిరిగి అదానీకి ఇచ్చేశామని, ఇలా చేయడం రాష్ట్రానికి నష్టమ ని, తనకు కాదన్నారు. పదేళ్లు పాలించి వందేళ్ల విధ్వంసం చేసి వెయ్యేళ్లకు సరిపడా సంపాదించుకున్నారని ఆరోపించారు.
బెదిరింపు రాజ కీయాలు చేస్తున్నారన్నారు. ఫార్మా సిటీ, ఫోర్త్ సిటీ, ట్రిపుల్ ఆర్ రోడ్డు, రేడియల్ రోడ్డు, మె ట్రో నిర్మిద్దామని తమ ప్రభుత్వం అనుకుంటుంటే కాళ్లల్లో కట్టె పెడుతున్నారని మండిపడ్డా రు. తనను గెలిపించిన కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు ఉపాధిని కల్పించాలని 1300 ఎకరాల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేద్దామనుకుంటే కార్యకర్తలను ఉసిగొల్పి అధికారులపై దాడులు చేయించారని మండిపడ్డారు.
16 మంది సీఎంలు చేయని అప్పు పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసింది..
75 ఏళ్ల దేశ చరిత్రలో ఉమ్మడి పాలన, ప్రత్యేక రాష్ట్ర పాలనలో చేయని అప్పును పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిందని సీఎం వెల్లడించారు. 16 మంది సీఎంలు చేసిన అప్పు కేవలం రూ. 72 వేల కోట్లు మాత్రమేనన్నారు. కానీ, పదేళ్ల బీఆర్‌ఎస పాలనలో వారు చేసిన అప్పు రూ. 7.11 లక్షల కోట్లు అని వివరించారు.
తాము చేసిన అప్పు రూ.1.27 లక్షల కోట్లన్నారు. ఉమ్మ డి రాష్ట్రంలో నాడు సంవత్సరానికి రూ.6,500 కోట్ల వడ్డి తెచ్చిన అప్పుకు కట్టేవాళ్లమని, కానీ ఇప్పుడు నెలకే అంతమొత్తంలో కడుతున్న పరిస్థితి వచ్చిందన్నారు. తాము ప్రజల డబ్బులతో ఎక్కడా ఫామ్ హౌజ్‌లు కట్టుకోలేదన్నారు. ధనిక రష్ట్రాన్ని చేతుల్లో పెడితే అప్పుల రాష్ట్రంగా చేశారని మండిపడ్డారు.
11.50 శాతం వడ్డీతో అప్పు తెచ్చారు..
కొన్ని బ్యాంకులు రెండు, మూడు, ఐదు శాతం వడ్డీతో అప్పులు ఇస్తున్నా...గత ప్రభు త్వం 11.50 శాతంతో అప్పు తెచ్చి ఆర్థిక మోసానికి పాల్పడ్డారని సీఎం మండిపడ్డారు. దుబాయ్‌లాంటి దేశాల్లో ఈ తరహా మోసాలు చేస్తే నడిరోడ్డుపై ఉరి తీస్తారని విమర్శించారు. అ ప్పులకు వడ్డీలు కట్టలేక తాను ఢిల్లీకు వెళ్లి రిజర్వ్ బ్యాంకు వాళ్లకు వడ్డీ తక్కువ చేయాలని విజ్ఞప్తి చేసుకోవాల్సి వస్తుందన్నారు.
గురుకులాల్లో బాలికల హాస్టళ్లలో కనీస వసతులు ఏ ర్పాటు చేయలేకపోయారన్నారు. బాత్రూములకు డోర్లు లేవని, ఇందుకు బీఆర్‌ఎస్ సిగ్గు పడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభు త్వం వచ్చాక మెస్ చార్జీలను పెంచామని, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కనీసం పరీక్షలను సజావుగా నిర్వహించ లేకపోయారని, పేపర్ లీకులు లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
నల్లగొండకు పోదామా?..
నల్లగొండ ప్రజలు బతకలేని పరిస్థితుల్లో ఉన్నారని సీఎం చెప్పారు. మూసీ, ఫ్లోరైడ్ సమస్యలతో ఆ జిల్లా ప్రజలు కొట్టుమిట్టాడుతు న్నారని తెలిపారు. పదేళ్లలో కనీసం 10 కిలోమీటర్ల ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తిచేయలేక పోయారని విమర్శించారు.కాలుష్యం, ఫ్లోరైడ్ నీళ్లతో మహిళలు గర్భం దాల్చడానికి వెనుకడుగు వేస్తున్నారంటే ఆ జిల్లా పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోచ్చన్నారు.
‘రా నల్లగొండకు పోదాం..అక్కడే ప్రజలను అడుగు దాం’ అని కేటీఆర్‌కు సీఎం సవాల్ విసిరారు. ‘మునుగోడు, భువనగిరి, నల్లగొండ ఎక్కడికిపోదామో చెప్పు నేను, రాజగోపాల్‌రెడ్డి గన్‌మె న్లు లేకుండా వస్తాం ప్రజలను అడుగుదామని’ కేటీఆర్, హరీశ్ రావుకు ఛాలెంజ్ విసిరారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడికైనా వస్తా..
కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తేనే రాష్ట్రానికి నిధులు వస్తాయని సీఎం చెప్పారు. అంతకుముందు పాయల్ శంకర్ మాట్లాడు తూ లేవనెత్తిన పలు అంశాలపై సీఎం సమాధానమిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకు పోయి కేంద్ర మంత్రులను కలవడానికి ఎలాం టి భేషజాలు లేవన్నారు. సీఎం పదవి కాదని, బాధ్యతన్నారు. రైతు భరోసాపై ప్రతిపక్షాలు సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు సభకు రాలేదు!
బీఆర్‌ఎస్ పాలనలో 3 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కానీ బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలోనే రైతుల ఆత్మహత్యలు తగ్గించామని ఆ పార్టీ నేతలు అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధ్దాలు చెప్పే సంఘానికి అధ్యక్షుడు అసెంబ్లీకి రాలేదు, ఆ సంఘానికి ఉపాధ్యక్షుడు అసెంబ్లీకి వచ్చారు.
కేసీఆర్ పదేళ్లు కష్టపడి కూలేశ్వరం కట్టారు!
ప్రత్యేక రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇస్తే దివాలా రాష్ట్రంగా మార్చారు. పదేళ్లు కష్టపడి కేసీఆర్ ‘కూలేశ్వరం’ కట్టారు. రూ.1.50 లక్షల కోట్లు ఖర్చుచేసి కేవలం 50 వేల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లిచ్చారు. ఆ రూ. 1.50 లక్షల కోట్లలో రూ.1.02 లక్షల కోట్లు కాంట్రాక్టులకు చెల్లించారు.
నిజాం, బ్రిటీష్, ఖాసీం రజ్వి తరహాలో బీఆర్‌ఎస్ వాళ్లు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. తెచ్చిన అప్పంతా వడ్డీలకే పోతోంది. రూ.1.27 లక్షల కోట్లు తమ వద్ద ఉండి ఉంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరు గ్యారెంటీలను అమలు చేసేవాళ్లం. ఆ పాపమంతా బీఆర్‌ఎస్ వాళ్లదే.
సీఎం రేవంత్ రెడ్డి