calender_icon.png 14 March, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిపుణుల వలస ఆగాలంటే?

18-12-2024 12:00:00 AM

తుష్టానర్థమానాభ్యాం పూజయేత్ అతుష్టాన్ సామదాన భేద దండెః సాధయేత్!

 కౌటిలీయం (1-13)

“రాజ్యాలైనా, వ్యాపార సంస్థలైనా వాటి నిర్వహణలో కీలకమైన వారు ఉద్యోగులే. నైపుణ్యం, సమర్థత, నిబద్ధత కలిగిన ఉద్యోగులు ప్రత్యర్థుల పక్షంలో చేరకుండా తుష్టులను (సంతృప్తులను) ధనంతో, సత్కారా దులతో పూజించాలి. అతుష్టులను (అసంతృప్తులను) సామ దాన భేద దండోపాయాలతో లొంగదీసుకోవా లి” అంటాడు ఆచార్య చాణక్య. తమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను ఉద్యోగికి అందించడం సంస్థకు సమయం, ఖర్చుతో కూడుకున్న పని.

అలాం టి ఉద్యోగి సంస్థను విడిచివెళితే మరొకరికి శిక్షణను ఇచ్చి తయారు చేసుకోవడం.. సంస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఎక్కువమంది ఉద్యోగులు సంస్థను విడిచి వెళితే నిర్వహణకు విఘాతం కలగడమేకాక సం స్థ సంస్కృతికీ, గౌరవానికీ భంగం కలుగుతుంది. కాబ ట్టి, ఉద్యోగుల నిష్క్రమణను వీలైన మేరకు ఆపడం మంచిది. అలాగని సమర్థత, నిబద్ధత లేని ఉద్యోగులను పోషించడమూ అనవసరం. దానికి తోడు కీలక బాధ్యతలు నిర్వహించే ఉద్యోగికి సంస్థ రహస్యాలు తెలుస్తాయి. అలాంటి వారు సంస్థను విడిచిపెడితే సం స్థకు అపారమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే, సమర్థత, నిబద్ధతలు గలిగిన ఉద్యోగులను జారి పోకుండా చూచుకోవడం ఈనాడు ప్రతి సంస్థకూ కత్తిమీద సాములాంటిదే.

ఉత్తమ ఫలితాలే కొలమానం

ఉద్యోగులను కృత్యులు (అసంతృప్తులు), అకృత్యు లు (సంతృప్తులు)గా విభాగించాడు చాణక్య. అసంతృప్త ఉద్యోగులను ప్రత్యర్థి సంస్థలు సునాయాసంగా తమవైపు లాక్కోగలుగుతాయి. సరైన గుర్తింపు లేకపోవడం, నాయకుడు అవమానించడం, దురాశ, ప్రలోభా లకు లొంగడం, తమను తాము పెద్దగా ఊహించుకోవడం.. ఇలా కారణాలేవైనా సమర్థత కలిగిన ఉద్యోగుల అసంతృప్తి సంస్థకు కీడు చేస్తుంది. వీరిని అనుక్షణం గమనిస్తూ అసంతృప్తులైన ఉద్యోగులలో ప్రతిభావంతుల వలసలను నాయకుడు సామదానభేద దండో పాయాలతో  ఆపగలగాలి.

ఇక, సంతృప్తి కలిగిన ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకుంటూ సమర్థతతో, నిబద్ధతతో, బాధ్యతాయుతంగా పనిచేస్తుంటారు. సా ధారణంగా వీరు వేతనాల పెంపును, స్థాయి పెంపును కోరరు. ఇలాంటి వారికి గౌరవంతోపాటు యాజమాన్యంలో ప్రాతినిధ్యం కల్పించాలి. వీరికి ఒకవేళ గుర్తింపు నివ్వకపోతే ప్రత్యర్థులు ఊహించని ధనాన్నో, ఉన్నత పదవినో ఆశచూపి ప్రలోభపెడతారు. అప్పుడు వారు సంస్థను విడిచే ప్రమాదం ఉంటుంది. అలాంటి ఉద్యోగుల సేవలను గుర్తిస్తూ గౌరవిస్తూ, వారడగక ముందే అవసరమైన వసతులు కల్పిస్తూ ప్రేరణనిస్తే నిబద్ధతతో పనిచేస్తారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. 

ఉద్యోగులు వారి వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశాలను కల్పించాలి. వారు సహజంగా ఎక్కువ సమయం గడిపేది కార్యాలయాలలోనే కాబట్టి అక్కడి వాతావరణాన్ని మెరుగు పరచాలి. ‘సంస్థ నాది, దీని ఎదుగుదలే నా ఎదుగుదలకు మూలం’ అనే భావనను వారిలో పెంపొందింపజేయాలి. నాయకుని అస మర్థత, కాలం చెల్లిన నిర్వహణా విధానాలు ఉద్యోగుల అసంతృప్తికి కారణాలవుతాయి. పని సంస్కృతిని సంస్కరించడం మంచి ఫలితాలనిస్తుంది. నిబద్ధత, సమర్థత కలిగి, అర్హత కలిగిన ఉద్యోగులకు ఉన్నత అవకాశాలను కల్పించడమూ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ప్రతిభను కనపరిచిన ఉద్యోగులను సత్కరించడం మిగతా ఉద్యోగులకూ ప్రేరణగా నిలుస్తుంది.

ఇతరులను అనుకరించకుండా తనదంటూ ప్రత్యేకమైన పని సంస్కృతిని కలిగిన సంస్థ వ్యాపార రంగం లో గుర్తింపు పొందుతుంది. ఉద్యోగులతో మమేకమై పని చేసే నాయకుని ఆధ్వర్యంలో పని చేసేందుకు ఉద్యోగులూ ఆసక్తి చూపుతారు. నాయకుడు ఎప్పుడూ ఉద్యోగులకు స్నేహితునిగా, మార్గదర్శిగా ఉంటూ, సంస్థలో  ఎక్కువ మంది నాయకులను సృష్టించడం వల్ల ఉద్యోగి- సంబంధాలు మెరుగవుతాయి. ఉద్యోగుల వలసలూ ఆగిపోతాయి. 

 పాలకుర్తి రామమూర్తి