టీచర్లకు బిల్లా, రంగాల గురించి చెబుతావా ?
ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్‌ఎస్సే
ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధమా?
సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోతూ పట్టుబడ్డ రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. డీఎస్సీ నియామక పత్రాల అందజేత సందర్భంగా బుధవారం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్‌ను కొరివి దెయ్యం అని తెలంగాణ ద్రోహులు తప్ప ఎవ్వరూ అనరని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో రేవంత్ లాంటి ఎన్నో కొరివి దెయ్యాలను తుదముట్టించి ప్రత్యేక రాష్ర్ట ఆకాంక్షను కేసీఆర్ నెరవేర్చారని తెలిపారు. విద్యార్థులకు బిల్లా రంగాల గురించి బోధించాలని టీచర్లకు చెబుతున్నావా అని ప్రశ్నించారు.
సీఎం స్థానంలో ఉండి రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఎన్ని దిష్టి బొమ్మలను కాల్చాలని నిలదీశారు. కేసీఆర్‌ను తిట్టడానికి సర్కారు సొమ్మును వినియోగిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని, అలాంటి వ్యక్తికి కేసీఆర్ త్యాగాలు ఎలా కనిపిస్తాయని ప్రశ్నించారు. నీలాంటి వాడికి 2014లో అధికారం ఇస్తే తెలంగాణను అమ్మేసే వాడివి అంటూ చురకలంటించారు.
అవి కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లే..
రేవంత్ రెడ్డి ఇచ్చిన 30వేల ఉద్యోగ నియామక పత్రాలు కూడా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల చలువే అని హరీశ్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే నోటిఫికేషన్ ఇస్తే, రేవంత్ రెడ్డి కేవలం అపాయింట్‌మెంట్ ఆర్డర్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. నియ్యత్ ఉంటే నిజం చెప్పాలని, నియ్యత్ అనేది సీఎం రేవంత్ డిక్షనరీలో లేదన్నారు.
స్టాఫ్ నర్సులు, సింగరేణి, పోలీసు, టీచర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్‌ఎస్సేనని అన్నారు. ఎన్నికల సమయంలో 25వేల మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, తాము ఇచ్చిన 5,089 డీఎస్సీ పోస్టులకు అదనంగా 6వేలు కలిపి నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.
మెగా డీఎస్సీ అంటూ దగా చేశావని ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో లక్షా 60వేలకు పైగా ఉద్యోగాలిచ్చామని, గతంలో అధికారంలో కాంగ్రెస్ ఇన్ని జాబ్‌లను ఇచ్చిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ మొదలు పెట్టిన 30వేల ఉద్యోగనియామకాల ప్రక్రియను చివరి దశలో పూర్తి చేసి కాంగ్రెస్ ఇచ్చినట్లు చెబుతున్నదని ధ్వజమెత్తారు.
ఓడిపోయిన వారికి పదవులు ఇవ్వలేదా?
ఎన్నికల్లో ఓడిపోయిన వారికి కూడా పదవులు ఇచ్చారంటూ రేవంత్ చేసిన విమ ర్శలను హరీశ్ తిప్పకొట్టారు. ఓడిపోయిన వారికి కాంగ్రెస్‌లో పదవులు ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఓడిపోతే అయనకు ఇవ్వలేదా అని నిలదీశారు. కవిత ఎన్నికల్లోనే ఎమ్మెల్సీగా గెలిచిందన్నారు.
నాడు అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే..
కేసీఆర్ హయాంలో ఉద్యోగాల నియామక ప్రక్రియను కాంగ్రెస్ నేతలు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని, ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్‌ను జాబ్ లెస్ క్యాలండర్‌గా మార్చింది రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పి పది నెలలైనా నియా మకాల ఊసే లేదన్నారు. సీఎంకు నిరుద్యోగులే కొరివి పెడతారని దుయ్యబట్టారు.
రాష్ర్ట ప్రజలకు ఇన్ని కష్టాలు ఎందుకు?
గంట కూడా రెస్ట్ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తే రాష్ర్ట ప్రజలకు ఇన్ని కష్టాలు ఎందుకు అని హరీశ్ ప్రశ్నించారు. ప్రజలను ఎలా భాధ పెట్టాలో రెస్ట్ లేకుండా ఆలోచిస్తున్నావా అంటూ చురకలు అంటించారు. తెలంగాణకు అసలు సిసలు కొరివి దెయ్యం రేవంత్ రెడ్డి అని,అసలైన కొర్రాయి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ద్రోహులకు కట్టు బానిస రేవంత్ అంటూ మండిప్డడారు. హర్యానా ఓటర్లు ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారెంటీలకు గోరి తవ్వారని, తెలంగాణలో బొంద తవ్వడం మొదలైందన్నారు.