హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్ర కాలుష్య నియంత్రణ మం డలి (పీసీబీ) పనితీరుపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పనిచేయకుండా, నిస్తేజంగా ఉంటూ కాలుష్యం వెదజల్లే కంపెనీలకు అండగా ఉందని ధ్వజమెత్తిం ది. పీసీబీని రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాల్సి ఉంటుం దని హెచ్చరించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కోడిచర్ల, తీగాపూర్, గుండ్లపట్లపల్లి, గంగారెడ్డిగూడ, అప్పాజీపల్లి తండా గ్రామాల్లో వ్యవసాయ భూ ముల్లో కాలుష్యం వెదజల్లే స్పాంజ్ ఐరన్ పారిశ్రామిక యూనిట్లు పనిచేయడాన్ని తప్పుపడుతూ రవీందర్‌రెడ్డి 2005లో హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు.. కంపెనీల గురించి తెలుసుకుని చెప్పడానికి ఇంకా గడువు కావాలని పీసీబీ తరఫు న్యాయవాది కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ దాఖలై 20 ఏండ్లు కావస్తోందని, ఇంకా గడువు కావాలనే దుస్థితిలో పీసీబీ ఉందా అని ప్రశ్నించింది. ఈ సమయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ కల్పించు కుని, కాలుష్యం వెలువడే పరిశ్రమ వారీ గా పూర్తి వివరాలు ఇచ్చేందుకు గడువు ఇవ్వాలని కోరడంతో అందుకు అంగీకరించిన హైకోర్టు విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.