calender_icon.png 15 March, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టా భూములకు మార్కెట్ ధర చెల్లించాలి..?

15-03-2025 12:00:00 AM

  • నిమ్జ్ భూసేకరణ ప్రశ్నార్థకం...?

బహిరంగ మార్కెట్ ధర చెల్లించాలని రైతుల డిమాండ్..

అసైన్డ్ , పట్టా భూములకు ఓకే నష్టపరిహారమా..?

రెండు వర్గాలుగా విడిపోతున్న రైతులు...

జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి భూ సేకరణలో తలెత్తుతున్న సమస్యలు...

న్యాల్కల్ మండలం మామిడ్గి గ్రామంలో గ్రామ సభను అడ్డుకున్న రైతులు..

ఒక వర్గం వారు భూములు ఇస్తామని ఒప్పంద పత్రాలు రాసిచ్చారు..

మరో వర్గం వారు బహిరంగ మార్కెట్ ధరకు భూములు ఇస్తామని ఆందోళన

గ్రామసభ నిర్వహించకుండానే మధ్యలో నుంచి వెళ్లిపోయిన రెవెన్యూ అధికారులు

 భూసేకరణ చేస్తున్న టీఎస్ ఐఐసీ

సంగారెడ్డి , మార్చి 14  (విజయ క్రాంతి): న్యాల్కల్, ఝరాసంగం మండలంలోని జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలం (నిమ్జ్) ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రైతుల నుంచి భూసేకరణ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిమ్జ్ ప్రాజెక్టు కోసం  12,680.24 ఎకరాల భూసేకరణ చేస్తుంది. ఇప్పటివరకు సుమారు 6000 ఎకరాల భూసేకరణ చేసినట్టు అధికారులు తెలిపారు.

ఎకరాకు ప్రభుత్వం పట్టా, అసైన్డ్ భూమికి రూ.15 లక్షలు చెల్లిస్తున్నారు. సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్నాయని, బహిరంగ మార్కెట్ ధర  చెల్లించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పట్టాభూమికి, అసైన్డ్ భూమికి ఒకే ధర ఇవ్వడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. న్యాల్కల్ మండలంలో సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్నాయని మార్కెట్ ధర ప్రకారం భూసేకరణ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం ఎకరాకు రూ. 15 లక్షలు చెల్లిస్తున్నారని, అదే బహిరంగ మార్కెట్లో ఎకరాకు  రూ. 50 నుంచి 60 లక్షల వరకు ధర పలుకుతుందని వారు తెలుపుతున్నారు. బహిరంగ మార్కెట్ లో ఉన్న ధర చెల్లిస్తేనే భూములు ఇస్తామని రైతులు అధికారులకు తెలుపుతున్నారు.

నిమ్జ్ భూసేకరణ అధికారులకు తలనొప్పిగా మారింది. గ్రామ సభలు నిర్వహించేందుకు గ్రామాలకు వెళ్లే అధికారులను రైతులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. భూసేకరణ నష్టపరిహారం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

బహిరంగ మార్కెట్ ధర చెల్లించాలని మామిడ్గి రైతుల డిమాండ్..!

మామిడ్గి గ్రామంలో సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్నాయని, బహిరంగ మార్కెట్ ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న రూ. 15 లక్షలు తమకు గిట్టుబాటు కాదని రైతులు తెలుపుతున్నారు.

ఐదు ఎకరాల భూమి పోయిన తమకు ఒక ఎకరా భూమి కొనుగోలు చేసే పరిస్థితి లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ ఊ ఎకరం భూమి రూ. 60 లక్షల వరకు పలుకుతుందని తమకు గిట్టుబాటు కాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు,నిమ్జ్ ప్రాజెక్టు అధికారులు తెలుపుతున్నారు. 

పట్టా భూమికి, అసైన్డ్ భూమికి ఒకే ధరనా..?

ప్రభుత్వం పట్టా భూములకు, అసైన్డ్ భూములకు ఒకే ధర చెల్లించడంతో కొందరు రైతులు అభ్యంతరం తెలుపుతున్నారు. పట్టా భూములకు బహిరంగ మార్కెట్ ధర చెల్లించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధర తమకు గిట్టుబాటు కాదని తెలుపుతున్నారు. అసైన్డ్ భూమి రైతులు రూ. 15 లక్షలకు ఎకరం  కు తమ భూములు ఇస్తామని ఒప్పంద పత్రాలు రాసి నిమ్జ్ ప్రాజెక్ట్ అధికారులకు ఇస్తున్నారు.

దీంతో రెండు వర్గాల మధ్య గ్రామంలో  విభేదాలు నెలకున్నాయి. ఒక వర్గం వారు భూములు ఇస్తామని, మరో వర్గం వారు భూములు ఇవ్వమని తెలపడంతో అధికారులు భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

భూములు ఇచ్చేందుకు అంగీకారం పత్రాలు రాసి ఇవ్వని  రైతుల వివరాలు తీసుకొని వారి డబ్బులను కోర్టులో డిపాజిట్ చేసి భూములు తీసుకోవాలని కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. భూసేకరణ చట్టం ప్రకారం ఎవరు ఎన్ని కుట్రలు చేసిన భూములు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు కోర్టులో కేసులు వేసిన సంఘటనలు ఫలితం ఉన్నాయి.

రైతులకు న్యాయం జరిగేనా..?

సారవంతమైన వ్యవసాయ భూములకు బహిరంగ మార్కెట్ ధర చెల్లించాలని కొందరు రైతులు డిమాండ్ చేస్తున్నారు . మరి కొందరు రైతులు తమ భూములు ఇస్తామని రెవెన్యూ అధికారులకు ఒప్పంద పత్రాలు రాసి ఇస్తున్నారు. దీంతో అధికారులు ఒప్పంద పత్రాలు రాసి ఇస్తున్న రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఒప్పంద పత్రాలు రాసి ఇవ్వని రైతుల వివరాలు సేకరించి కోర్టులో వారి డబ్బులు డిపాజిట్ చేస్తామని తెలుపుతున్నారు.

ప్రభుత్వం నిబంధనలు ప్రకారం భూ సేకరణ చేస్తున్నామని, ఇందులో ఎక్కడ అవినీతి అక్రమాలు లేవని అధికారులు తెలుపుతున్నారు. జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి భూసేకరణ ప్రశ్నార్థకంగా మారుతుంది. కొందరు రైతులు భూములు ఇస్తామని, మరికొందరు ఇవ్వమని తెలపడంతో గ్రామాలలో రైతుల మధ్య విభేదాలు నెలకొంటున్నాయి.

రెవెన్యూ అధికారులు రైతుల భూములు సేకరించేందుకు పత్రికల్లో నోటిఫికేషన్లు జారీచేసి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అభ్యంతరాలు ఉంటే పరిశీలించి వాటిని పరిష్కారం చేస్తున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి భూములు తీసుకుంటున్నామని ఇందులో ఎవరికి అన్యాయం జరగదని అధికారులు తెలుపుతున్నారు.