వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరవుతున్న హస్తినాపురి
కృతిమ వర్షాలు కావాలంటూ విజ్ఞప్తులు
రాజధానిగా అవసరమా అంటూ చర్చ
ఢిల్లీ, నవంబర్ 19: పర్యావరణంలో గాలి నాణ్యత లోపించడంతో ఢిల్లీ తల్లడిల్లుతోంది. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితులు మాత్రం అదుపులోకి రావడం లేదు. సుప్రీం కోర్టు కలగజేసుకుని కొత్త నిబంధనలు, ఆంక్షలు విధించినా ఏ మాత్రం ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పరిస్థితులు చక్కబడాలంటే కృతిమ వర్షమే ఉత్తమ పరిష్కారం అని సాధారణ ప్రజలతో పాటు పాలకులు కూడా విశ్వసిస్తున్నారు. చొరవ చూపాలని కేంద్రాన్ని వేడుకుంటున్నారు.
కృతిమ వర్షం కురిపించండి..
ఢిల్లీ వీధుల్లో కృతిమ వర్షం కురిపించి ఈ కాలుష్యం నుంచి నగరానికి విముక్తి కల్పించాలని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రాన్ని కోరారు. ‘ఢిల్లీ కాలుష్యం ఒక రకమైన మెడికల్ ఎమర్జెన్సీయే. దీనికి కృతిమ వర్షమే పరిష్కారం. కృతిమ వర్షం కురిపించమని గత మూడు నెలలుగా ఉత్తరాలు రాస్తున్నా ఫలితం లేదు’ అని రాయ్ పేర్కొన్నారు. ఢిల్లీ పరిస్థితి వల్ల అసలు దేశంలో ఏ నగరాల్లో కాలుష్యం తక్కువగా ఉంటుందనే చర్చ మొదలైంది. తక్కువ కాలుష్యం నమోదయ్యే నగరంగా మిజోరాం రాజధాని ఐజ్వాల్ రికార్డులకెక్కింది. ఇక మన భాగ్యనగరం 121 ఏక్యూఐతో మధ్యస్థ లెవల్‌లో ఉంది.
ఫలించని కొత్త ఆంక్షలు..
ఢిల్లీ వాతావరణ పరిస్థితి ఏ మాత్రం మారలేదు. కొత్తగా అమలు చేసిన జీఆర్‌ఏపీ4 నిబంధనలు అంతగా ప్రభావం చూపలేదు. మంగళవారం ఉదయం నాటికి గాలి నాణ్యతా సూచీ (ఏక్యూఐ) 494కు పడిపోయింది. చాలా ఆఫీసులు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. పలు రైళ్లు రద్దయ్యాయి. విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావంతో సుప్రీం కోర్టు జడ్జీలు వర్చవల్‌గా వాదనలు వినాలని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు.
ఇంకా రాజధానిగా అవసరమా?
కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీకి ఇప్పుడప్పుడే ఉపశమనం లభించేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రపంచంలో అత్యంత కాలుష్యనగరాల జాబితాను పోస్ట్ చేస్తూ.. ‘ఢిల్లీ కాలుష్యం ఇంతలా పెరిగిపోయిన ఈ సమయంలో అసలు ఢిల్లీ ఇంకా రాజధానిగా కొనసాగాలా? నవంబర్ మధ్య ఇక్కడ నివాసం ఉండేందుకే చుక్కలు కనిపిస్తున్నాయి’ అని అన్నారు.