calender_icon.png 23 October, 2024 | 6:55 PM

జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా రంగాల్లో రాణించాలి

23-10-2024 04:53:52 PM

కరీంనగర్ (విజయక్రాంతి): విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో గ్రంథాలయం ప్రారంభించిన అనంతరం విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో క్రీడాకారులకు కొరత ఉందని చదువుతో పాటు ఆటల్లో రాణిస్తే సమాజంలో గుర్తింపు, గౌరవం, ఉన్నత ఉద్యోగాలు దక్కుతాయన్నారు. కష్టాన్ని నమ్ముకుని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. క్రీడా పాఠశాల విద్యార్థులకు ప్రతివారం తప్పనిసరిగా ఒక సందేశంత్మక సినిమా చూపించాలని అధికారులకు సూచించారు. త్వరలో క్రీడా పరికరాలు, దుస్తులు అందిస్తామన్నారు. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ.. తక్కువ సమయంలో సమాజంలో గౌరవం సంపాదించాలంటే క్రీడలను ఎంచుకోవడమే మార్గం అన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  డీవైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ రాంబాబు, పాఠశాల హెచ్ఎం లీలా ప్రసాద్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.