calender_icon.png 3 October, 2024 | 11:59 AM

సీఎం సిద్ధూ అరెస్టు తప్పదా?

03-10-2024 12:33:42 AM

ఈడీ ఎంట్రీతో డేంజర్ జోన్‌లో కర్ణాటక సీఎం

కేంద్రం చేతుల్లోకి వెళ్లిన ముడా కుంభకోణం

కేజ్రీ, హేమంత్ తర్వాత సిద్ధూపై బీజేపీ టార్గెట్!

బెంగళూరు, అక్టోబర్ ౨: దేశంలో ఇతరపార్టీల ముఖ్యమంత్రులే టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసు లో సీబీఐ అరెస్టు చేయగా.. లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ జైలుకు వెళ్లారు. వీరి తర్వాత తర్వాతి టార్గెట్‌గా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు.

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయిం పుల కేసు ఆయన మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు మొదటగా సిద్ధరామయ్యపై లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

ఇందులో సిద్ధూను ఏ1గా, ఆయన భార్య పార్వతమ్మ పేరును రెండో ముద్దాయిగా చేర్చింది. అదే సమయంలో ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసు కోకుండా కర్ణాటకలో సీబీఐ విచారణకు అనుమతిని నిరాకరిస్తూ సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈడీ రంగంలోకి దిగి మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. 

కేంద్రం చేతుల్లోకి ముడా కేసు

ఈడీ ఎంట్రీతో విషయం మొత్తం కేంద్రం చేతిలోకి వెళ్లినట్లయింది. ఫలితంగా ఇప్పుడు సిద్ధరామయ్య అరెస్టు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండగా.. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. వారినే ఇప్పుడు బీజేపీ టార్గెట్ చేస్తోందని అంటున్నారు.

వరుసగా జార్ఖండ్, ఢిల్లీ, కర్ణాటక ముఖ్యమంత్రుల మీద కేసులు, అరెస్టులు చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోంది. ఇప్పటికే హేమంత్, కేజ్రీవాల్ జైలుకు వెళ్లి బెయిల్‌పై రాగా ప్రస్తుతం సిద్ధరామయ్యపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య, బావమరిది మల్లికార్జునస్వామి కూడా అరెస్టు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 

సీఎం పదవికీ గండమే

ఈ పరిస్థితుల నడుమ సిద్ధరామయ్య భార్య.. తనకు ముడా కేటాయించిన భూములను తిరిగి ఇచ్చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. బీజేపీ, జేడీయూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తోందని, అందుకే తన కుటుంబాన్ని వివాదంలోకి లాగారని ఆరోపించారు. పార్వతమ్మ ప్రకటన తర్వాత విపక్షాలు విమర్శలను తీవ్ర తరం చేశాయి. తప్పు జరగనప్పుడు భూమిని తిరిగిచ్చేయడం ఎందుకని బీజేపీ ప్రశ్నిస్తోంది.

అవినీతి జరిగినట్లు సీఎం ఒప్పుకున్నట్టేనని ఆరోపిస్తోంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అం తేకాకుండా భూమి కేటాయింపు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపి నిజా నిజాలు తేల్చాలని కాషాయ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ముడా స్కాం ఆరోపణలు మొదలైన నాటి నుంచి అధికార కాంగ్రెస్‌లోనూ రెండు వర్గాలు విరుద్ధ ప్రకటనలు చేస్తూ వచ్చాయి. సిద్ధరామయ్యకు పార్టీతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతు తెలిపినా కొంతమంది నేతలు మాత్రం సీఎం మార్పుపై బహిరంగంగానే చర్చించారు. దీంతో సిద్ధు పదవిపైనా అనుమానాలు నెలకొన్నాయి.