28-02-2025 01:19:12 AM
ఖమ్మం, ఫిబ్రవరి -27 ( విజయక్రాంతి ): నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ లబ్ధిదారులు నాణ్యతతో కూడిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ఏన్కూరు మండలం, రేపల్లెవాడ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రణాళిక వివరాలను కలెక్టర్ లబ్ధిదారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించారు.
గ్రామంలో రైతులు ఎటువంటి పంటలు పండించుకుంటు న్నారు, దిగుబడి ఎంత వస్తుంది, గ్రామాల్లో ఇతర సమస్యల గురించి కలెక్టర్ తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను ప్రతి మండల కేంద్రానికి తీసుకుని వచ్చే బాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకుంటుందని, మండల కేంద్రం నుంచి లబ్ధిదారుడు ఇంటి నిర్మాణానికి తక్కువ ధరతో ఇసుక తరలించేలా చూడాలని అన్నారు.
మండల కేంద్రంలో పెట్టే ఇసుక డంప్ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సంపూర్ణ అవగాహన ఉండాలని కలెక్టర్ తెలిపారు. భూమి పూజ నుంచి గృహప్రవేశం వరకు ఇంటి నిర్మాణంలో ప్రతి అడుగులో లబ్ధిదారులకు తోడ్పాటు అందిస్తామని అన్నారు.
సిమెంట్ కూడా ఇందిరమ్మ లబ్ధిదారులకు తక్కువ ధరకు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అరులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో హౌజింగ్ పిడి శ్రీనివాసరావు, ఏన్కూరు మండల తహసీల్దార్ శేషగిరిరావు, ఎంపిడివో రమేష్, రేపల్లెవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు