09-04-2025 12:48:02 AM
జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్,ఏప్రిల్ 8 (విజ యక్రాంతి): వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళి కతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని 15 మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, మిషన్ భగీరథ ఇంజనీర్లు, గ్రామీణ ఉపాధి హామీ సిబ్బందితో త్రాగునీరు, ఇందిరమ్మ ఇండ్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనుల కల్పన పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల గ్రామాలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండానే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా త్రాగునీరు అందించాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, పైప్ లైన్లు, మోటార్లు, గేట్ వాల్ వంటి మరమ్మత్తులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా త్రాగునీరు అందని గ్రామాలలో ప్రత్యామ్నాయంగా గ్రామపంచాయతీ ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని తెలిపారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజుల ఉపాధి హామీ పని దినాలు కల్పించాలని, గ్రామాలలో మ్యాజిక్ సోక్ ఫీట్స్, సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణం కొరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు పథకంలో మొదటి విడత పైలట్ గ్రామాలలో ఎంపికైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్ నిర్మాణాలను పూర్తి చేసినవారికి సంబంధిత బిల్లులు చెల్లించాలని, ఇంకా ప్రారంభించని వారు త్వరగా పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి లక్ష్మీనారాయణ, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, గృహ నిర్మాణ శాఖ అధికారు లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.