- ఎన్నికలయ్యే వరకు జార్ఖండ్‌లోనే ఉంటా
- ఎన్నికల పరిశీలకుడిగా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా
- కాంగ్రెస్ కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
- జార్ఖండ్ ఎన్నికల పరిశీలకులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇన్‌ఛార్జిలు నియోజక వర్గాలను వదిలిపెట్టవద్దని జార్ఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జి, స్టార్ క్యాంపెయినర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
తాను కూడా ఎన్నికలు పూర్తయ్యే వరకు జార్ఖండ్‌లోనే ఉంటానని, పార్టీ పెద్దలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు భట్టి పేర్కొన్నారు. శుక్రవారం జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఏర్పాటు చేసిన సీనియర్ కాంగ్రెస్ నేతలు, అసెంబ్లీ నియోజక వర్గాల ఇన్‌ఛార్జిల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో విస్తృతంగా, సరైన పద్ధతిలో ప్రచారం నిర్వహించాలని, సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని పార్టీ నేతలకు భట్టి సూచించారు.
సమన్వయం చేయాలి..
జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ నేతలను, ఇతర నాయకులను అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు సమన్వయం చేయాలని ఆదేశించారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరితోనూ, కాంగ్రెస్ కూటమిలోని ఇతర నేతలతోనూ చర్చించాలని, వారందరూ ప్రచారంలో పాల్గొనేలా చూడాలని భట్టి సూచించారు.
తాము పరిశీకులుగా స్థానిక నేతలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని, మా బాధ్యతగా ఏ కార్యక్రమం నిర్వహించాలంటే.. ఆ కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ నేతలకు సూచించారు. దేశంలో తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ఏఐసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దేశ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఏఐసీసీ పెద్దలు చేస్తున్న శ్రమను స్ఫూర్తిగా తీసుకుని వారి కన్నా ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం ఉందని భట్టి తెలిపారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే మనమంతా గెలిచినట్లేనని ఆయన అన్నారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌తో పాటు అనుబంధ విభాగాలతో సమావేశం నిర్వహించాలని సూచించారు.
కాంగ్రెస్ వార్‌రూమ్ నుంచి సమాచారం అందగానే ఆ సందేశాన్ని తీసుకుని నియోజకవర్గాలకు వెళ్లాలన్నారు. జార్ఖండ్ ఎన్నికల పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు రామ్‌గడ్, బోకోరో అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను కూడా తీసుకున్నట్లు సమావేశంలో భట్టి వివరించారు.
మ్యానిఫెస్టోపై కసరత్తు..
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ కూటమి విడుదల చేయాల్సిన మ్యానిఫెస్టోపైన శుక్రవారం రాంచీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేశ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు గులాం అహమ్మద్ మీర్‌సాబ్, గౌరవ్, బీకే హరిప్రసాద్, రామేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.