04-04-2025 12:00:00 AM
దేశంలోని పేద ప్రజలను ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి రక్షించ డానికి చౌకగా నిత్యావసర వస్తువులను అందించి, ఆహార భద్రతను కల్పించడానికి 1960వ దశకం నుంచి మన దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ప్రారంభమైంది. నాటినుంచి నేటివరకు ఈ విధానం అనేక రూపాంతరాలు చెందుతూ విస్తృత నెట్‌వర్క్‌తో దేశం నలుమూలలా వ్యాప్తి చెంది పేద ప్రజలకు ఆహార భద్రతను కల్పిస్తున్నది. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థ ద్వారానే ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్’ అన్నా యోజన పథకం ద్వారా ఇప్పటికీ దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నారు. 2013లో ఆహార భద్రతా చట్టంతో ప్రజాపంపిణీ వ్యవస్థ పేదలకు మరింత చేరువైంది.
డాక్టర్ తిరుణహరి శేషు
ఆహార భద్రతా చట్టం తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న నిత్యావసరాలను సంక్షేమ పథకాల జాబితా నుంచి తొలగించారు. ప్రజాపంపిణీని ఒక చట్టంగా తీసుకురావటం వ్యవస్థలో ఒక మైలురాయిగానే భావించాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు ప్రజాపంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా, విస్తృతంగా అమలు చేశాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తూ, మార్చి 30 ఉగాదినాడు రాష్ట్రంలోని 3.10 కోట్లమందికి సన్నబియ్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యయం.
దేశంలోనే తొలిసారి
ప్రజాపంపిణీ వ్యవస్థలోని చౌకధరల దుకాణాల (రేషన్ షాపులు)ద్వారా దేశంలోని కోట్లాది మందికి బియ్యం, గోధుమ లు వంటి నిత్యావసర వస్తువులను ప్రభు త్వం సరఫరా చేస్తున్నది. ఆయా సందర్భాలలో ఈ వస్తువుల నాణ్యత, సరఫరా తీరు పైన పలు విమర్శలు వస్తున్నాయి. 1983 లో నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి న తర్వాత ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక సంచలనం. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆ పథకాన్ని అమలు చేశాయి. రూపాయికి కిలో బియ్యం ప్రస్తు తం రేషన్ షాపుల ద్వారా ఉచితంగా ప్రతి పేదవానికి నెలకి 5 కిలోల చొప్పున బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం రేషన్ షాప్‌లద్వారా పేదప్రజలకు సరఫరా చేస్తున్న దొడ్డు బియ్యాన్ని ప్రజలు వినియోగించడం లేదనే ప్రధాన ఆరోపణతోపాటు బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ అక్రమార్కులు, దళారులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ లక్ష్యం దెబ్బతింటున్నది. అలా దొడ్డు బియ్యం 85 శాతం మేర వృధా అవుతూ, పక్కదారి పడుతున్నట్టు ప్రభు త్వం అంచనా వేస్తున్నది.
ఈ దుర్వినియోగాన్ని అరికడుతూ, పేద ప్రజలకూ నాణ్యమైన బియ్యాన్ని అందజేయటానికి దేశంలోనే మొదటిసారిగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 17,227 రేషన్ షాప్‌లద్వారా దాదాపు 91.19 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్న 3.10 కోట్లమందికి నెలకు ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియాన్ని పంపిణీ చేసే కొత్త పథకాన్ని హుజూర్‌నగర్ నుంచి ప్రారంభించారు. దీనిని అమలు చేయటానికి ప్రతి నెల 2.30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4.59 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యంతోపాటు 24 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల నూ సేకరించింది. సన్న బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేయటానికి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా రూ. 2,800 కోట్లు ఖర్చవుతుంది.
దొడ్డు బి య్యం పంపిణీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రూ. 10,665 కోట్ల ను (5,489 + 8,033) ఖర్చు చేస్తున్నా యి. అంటే, సన్న బియ్యం పథకం అమలు చేయడానికి ఒక సంవత్సరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 13,465 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఉన్న 89.73 లక్షల ఆహార భద్రత కార్డులకు అదనంగా ప్రభుత్వం మరో 10 లక్షల కార్డులను కొత్తగా జారీ చేయడం వల్ల మరొక 31 లక్షలమంది రేషన్ షాప్‌ల ద్వారా సన్న బియ్యం పొందటానికి అర్హత సాధిస్తారు.
తెలంగాణలో దరిదాపు 85 శాతం ప్రజలు సన్న బియ్యం పంపిణీ పథకం కిందికి రాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ సన్న బియ్యం పంపిణీ పథకం భవిష్యత్తులో దేశం మొత్తానికి ఆదర్శంగా నిలువబోతుందనే చెప్పాలి. ‘గరీబీ హఠావో’ నినాదంతో శ్రీమతి ఇందిరాగాంధీ అమ్మ అయినట్లుగా రెండు రూపాయలకే కిలో బియ్యంతో ఎన్టీ రామారావు అన్న అయినట్లుగా, సన్న బియ్యంతో తాను కూడా అన్న కావాలన్నదే తన ఆకాంక్ష అని బహిరంగ వేదికలపైనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
మరింతగా విస్తృత పరచాలి
ద్రవ్యోల్బణం ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందజేయటం ద్వారా పేద ప్రజలకు ఆహార భద్రతను ఇవ్వడంతోపాటు పౌష్టికాహార స్థాయిని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కాబట్టి, ప్రజా పంపిణీ వ్యవస్థని మరింత విస్తృత పరిచి, మరిన్ని నిత్యావసర వస్తువులను అందజేయాల్సి ఉంటుంది. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మహస్తం పథకం ద్వారా రేషన్ షాప్‌ల ద్వారా పేద ప్రజలకు 9 రకాలైన నిత్యావసర వస్తువులను అందించేవారు. ఎన్టీ రామారావు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకి చౌకధరలకే జనతా వస్త్రాలను కూడా అందాయి. కానీ, ప్రస్తుతం కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. పేద ప్రజలకు తక్కువ ధరలకే కందిపప్పు, పంచదార, జొన్నలు, గోధుమలు, రాగులు, నూనెలు తదితర నిత్యావసర వస్తువులను కూడా అందజేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు ప్రజలు నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వమూ ఆ దిశగా ఆలోచించినప్పుడే ఆహార భద్రతా చట్టానికి పూర్తి సార్థకత ఏర్పడుతుంది.
జాగ్రత్తలు అవసరం
సంవత్సరానికి రూ. 13,465 కోట్లు ఖర్చు పెట్టి పేద ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కల్పించే ఇలాంటి బృహత్తర పథకాన్ని ప్రభుత్వం ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా, నాణ్యతలో రాజీ పడకుండా అమలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం దొడ్డు బియ్యానికి ఒక కేజీకి రూ. 40 ఖర్చు చేస్తే సన్న బియ్యానికి కేజీకి దరిదాపు రూ. 60 ఖర్చు చేయబోతున్నది. అయితే, పథకం లక్ష్యాలు దెబ్బ తినకుండా, ఉద్దేశాలు పక్కదారి పట్టకుండా గతంలోలాగా ఆరోపణలు అవకాశం రాకుండా సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంది. రేషన్ బియ్యం గతంలో తీసుకోవటానికి ఇష్టపడని వారు ఇప్పుడు రేషన్ షాప్‌లవైపు అడుగులు వేస్తారు. ఏదైతేనేం, ఈ రకంగా దేశంలో ఇదొక గొప్ప పథకంగా మిగులుతుందనడంలో సందేహం లేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు, లక్ష్యాలు బాగుంటున్నాయి. కానీ వాటి అమలులో పూర్తిస్థాయి చిత్తశుద్ధి కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. రైతు రుణమాఫీలో గందరగోళం, రైతు భరోసా చెల్లింపులో అలసత్వం, ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో తాత్సారం, మహాలక్ష్మి పథకం అమలు, పెన్షన్ల పెంపులో ఆలస్యం లాంటి విషయాలలో ప్రభుత్వం ప్రజలలో నమ్మకాన్ని కల్పించలేక పోతున్నది. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఒక్క రేషన్ కార్డును కూడా ఇవ్వలేక పోవటం ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలి కానీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పెట్టుబడుల ఆకర్షణకి తెలంగాణ రైజింగ్ లాంటి నినాదాలతో భారత్ సమ్మిట్ లాంటి సదస్సు ఏర్పాట్లు ప్రభుత్వ ప్రతిష్టను పెంచుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్నబియ్యం పంపిణీ ఒక మైలురాయిగా మిగలాలని ఆశిద్దాం.
వ్యాసకర్త సెల్: 9885465877