అక్టోబర్ 30న నారాయణపేట జిల్లాలోని తహసిల్దార్ కార్యాలయాల ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయండి
నారాయణపేట (విజయక్రాంతి): ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పంటలన్నిటికీ మద్దతు ధరలు ప్రకటించి ప్రభుత్వం బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండుతో అక్టోబర్ 30 నుండి నవంబర్ 5 వరకు మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో కోటకొండ, అభంగాపూర్, తిరుమలపూర్ గ్రామాల్లో కరపత్రాల పంపిణీ తో ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.యాదగిరి మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్ సీజన్ పంటలన్నిటికీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సమగ్ర ఖర్చుల ప్రతిపాదికన కనీసం మద్దతు ధరలు నిర్ణయించి ప్రభుత్వమే విస్తృతంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వేగవంతంగా కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం వరి సన్నారకం మాత్రమే బోనస్ ప్రకటించడం కాకుండా ప్రభుత్వం ప్రకటించిన అన్ని రకాల వారితో పాటు పత్తి, కంది, మినుము, వేరుశనగ, సోయా, చెరుకు, పసుపు పంటలన్నిటికీ బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు.
ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఇవ్వవలసిన రైతు భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టడం, రైతులకు రెండు లక్షల రుణమాఫీ సగం మంది రైతులకు వేసి మిగతా రైతులకు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వారిని వంచించడం, మోసగించడం సరికాదన్నారు. ఈ ప్రభుత్వా రైతు విధానాలకు వ్యతిరేకంగా పోరాడి మన సమస్యలు మనం పరిష్కరించుకొనుటకు అక్టోబర్ 25 నుండి నవంబర్ 5 వరకు AIPKS రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపునందుకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం AIPKS మండల అధ్యక్షులు బి.నారాయణ, AIPKMS జిల్లా ఉపాధ్యక్షులు జి.వెంకట్ రాములు, TUCI జిల్లా నాయకుడు భీమేష్, సుభాష్, ఇస్మాయిల్, సలీం దస్తప్ప తదితరులు పాల్గొన్నారు.