తెలంగాణలో 17 రోజులు మాత్రమే
గతేడాది బిల్లుల ఆమోదంలో 16వ స్థానంలో రాష్ట్రం
ఏడు రాష్ట్రాల్లో గవర్నర్లు వర్సెస్ ప్రభుత్వాలు
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో చట్టసభలు చాలా ముఖ్య భూమికను పోషిస్తాయి. ప్రజలు, రాష్ట్ర భవిష్యత్‌ను అవే నిర్ణయిస్తాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న రాష్ట్రాల అసెంబ్లీల సమావేశాలను కంటితుడుపు చర్యగా, చాలా తక్కువ రోజులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర చట్టాల వార్షిక సమీక్ష నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 2023లో దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఎన్ని బిల్లులు ఆమోదించారు? ఎంత సమయం చర్చించారు? ఎన్నిరోజులు జరిగాయి? గవర్నర్లతో ఘర్షణలతో కూడిన వివరాలను ఆ నివేదిక వివరించింది.
ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ రిపోర్టు కీలక విషయాలను వెల్లడించింది. 2023లో తెలంగాణ అసెంబ్లీ కేవలం 17 రోజలు నడిచిందని పేర్కొంది. ఇక ఏపీలో మరింత తక్కువగా 10రోజలు మాత్రమే సమావేశాలను నిర్వహించినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. సమావేశాల నిర్వహణలో మహారాష్ట్ర టాప్‌లో ఉంది. గతేడాది అత్యధికంగా 42 రోజుల పాటు మహారాష్ట్ర అసెంబ్లీ నడిచింది. ఈ జాబితాలో తెలంగాణలో 15వ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే, తెలంగాణ శాసనమండలి సమావేశాలను కేవలం 10 రోజులు మాత్రమే ఏర్పాటు చేశారు.
సభ్యుల సంఖ్యను బట్టి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను పరిగణలోకి తీసుకుంటే.. గతేడాది సగటున 22 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఒక ఐదు రాష్ట్రాలు మాత్రం ఈ సమావేశాలను అతి తక్కువ రోజులు నిర్వహించాయని నివేదిక పేర్కొంది. అందులో పంజాబ్, ఏపీ 10 రోజులు, హర్యానా 14 రోజులు, తెలంగాణ 17 రోజులు, మధ్యప్రదేశ్ 18 రోజులు నిర్వహించాయని చెప్పింది. 2017లో తెలంగాణ అసెంబ్లీ అత్యధికంగా 37 రోజల పాటు సమావేశమైంది. ఆ తర్వాత ఏడాది నుంచి రోజులు తగ్గుతూ వస్తున్నాయి. 2023లో ఏకంగా 20 రోజుల కంటే తక్కువగా సమావేశాలను నిర్వహించడం గమనార్హం.
గవర్నర్ లేకుండా..
2023లో ఏడు రాష్ట్రాల్లో గవర్నర్లతో ఘర్షణ కారణంగా అసెంబ్లీ సమావేశాలను రద్దు చేయకుండా సుదీర్ఘకాలం కొనసాగించినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ జాబితాలో తెలంగాణతో పాటు ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య నెలకొన్న వివాదం గురించి అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలో 2021 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు గవర్నర్‌ను పిలవకుండా గత సమావేశాలకు కొనసాగింపుగా గత సర్కారు అసెంబ్లీ సెషన్లు నిర్వహించినట్లు నివేదిక చెప్పింది. ఇలాంటి తరహా ఘటనలు ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోనూ జరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉంటే సమావేశాల నిడివికి సంబంధించి పరిశీలిస్తే తెలంగాణలో సగటున 6 గంటలు పాటు సమావేశాలు కొనసాగినట్లు నివేదిక పేర్కొంది.
ఎన్ని బిల్లులు ఆమోదించారంటే..
గతేడాది ఢిల్లీ సహా 29 రాష్ట్రాల్లో కలిపి సగటున 18 బిల్లులను అసెంబ్లీలు ఆమోదించాయని నివేదిక వెల్లడించింది. తెలంగాణలో మొత్తం 11 బిల్లులను ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర అత్యధికంగా 49 బిల్లులకు ఆమోదముద్ర వేసింది. ఈ జాబితాలో 42 బిల్లులతో ఏపీ రెండోస్థానంలో ఉండగా.. తెలంగాణ 16వ స్థానంలో నిలిచింది. తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గవర్నర్లతో వివాదం కారణంగా బిల్లు ఆమోదం ఆలస్యమైనట్లు నివేదిక చెప్పింది. గవర్నర్లు వీలైనంత త్వరగా బిల్లులను ఆమోదించాలని రాజ్యాంగం చెబుతోంది.
అయితే 2023లో అలా జరగలేదు. గతేడాది సగటున 55 శాతం బిల్లులను దేశంలోని గవర్నర్లు ఆమోదించారు. తెలంగాణలో బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపేందుకు సగటున రెండు నెలల సమయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అయితే సగటున 92 రోజలు సమయాన్ని గవర్నర్ తీసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో ఆర్థిక క్రమశిక్షణకు అనుసరించే మార్గాల అన్వేషణపై చర్చించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని నివేదిక అభిప్రాయపడింది.