21-04-2025 12:39:20 AM
పెన్ పహాడ్, ఏప్రిల్ 20 : ఒకపక్క రుణమాఫీ కాక, రైతు బంధు రాక తప్పని పరిస్థితిలో వడ్డీ వ్యాపారులే దిక్కని అందిన కాడికి అప్పులు తెచ్చి ఆరు కాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర, బోనస్ వస్తుందని ఆశతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వెళితే రైతన్నకు అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి.
ఒక్క పక్క ఉరుములు, మెరుపులు, వర్షాలు..మరోపక్క దాన్యం కాంటాలు కాక కేంద్రాలలో ఎండకు ఎండి వానకు తడుస్తూండగా రైతుల బాధలు సీతమ్మ కష్టాలు వారు పడుతున్న హరిగోన ఇంత కాదు. రైతే రాజు.. దేశానికి వెన్నుముఖ రైతు అని గొప్పలు చెప్పే ప్రభుత్వాలు రైతన్నను నట్టేట ముంచేందుకు వస్తున్న ఆరోపణలు పరిపాటిగా ఉండవని పేర్కోంటున్నారు.
ఇదిలా ఉంటే రైతులు పడుతున్న బాధలు.. కష్టాలు అధికారుల మొద్దు నిద్ర వీడక పోవడమే అని ఆరోపణలు రాక తప్పడం లేదు. అధికారుల నిర్వహణ.. పర్యవేక్షణ..చర్యలు సరిగా లేకపోవటంతో ప్రభుత్వం నిందలు మోయడం తప్పడం లేదు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో ఐదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
కాగా అనంతారం, నారాయణగూడెం, పెన్ పహాడ్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి (పీఏసీఎస్) ఆధ్వర్యంలో అలాగే అనాజీపురం, మహ్మదాపురం. గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో దాన్యం కొనుగోలు కేంద్రాలను ఈనెల మొదటి వారంలోనే అధికారులు ప్రారంభించారు. ప్రారంభం నాటి నుంచే గ్రహపాటు చోటు చేసుకుంది. ఇదంతా అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ, చర్యలు లేకపోవడంతో ఉరిమి ఉరిమి ’రైతన్న’పై పడినట్టుగా.. దీంతో రైతన్న దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
రవాణా కాక మూలుగుతున్న ధాన్యం బస్తాలు, రాశులు..
మండలంలోని అనంతారం, నారాయణగూడెం పీఏసీఎస్ కేంద్రంలో సుమారు 8వేల900 బస్తాలు కాంటాలు వేసి 5980 బస్తాలు లారీల ద్వారా ట్రాన్స్పోర్టు చేసి చింతలపాలెం శివసుభ్రమణ్యేశ్వర మిల్లు, కోదాడలోని శ్రీవెంకటలక్ష్మి మిల్లు, ఎఫ్ సీఐ కు రవాణ చేశారు. అలాగే అనాజీపురంలో 1355 క్వింటాల దాన్యం కొనుగోలు చేయగా ఇప్పటి వరకు ఐదు లారీల ద్వారా ఇదే మిల్లులకు ట్రాన్స్ఫోర్టు చేశారు.
ఇందులో రెండు లారీలు దిగుమతి కాకపోవడంతో నేటికి ఐదో రోజుకు చేరుకుంది. అంతేకాకుండా లారీలు వస్తాయని ఆలోచనలో నిర్వహకులు వేల బస్తాలు కాంటాలు వేయగా ట్రాన్స్ఫోర్టు కోసం ఎదురు చూస్తున్నాయి. కాంటాలు కాక కొన్ని వందల రాశులు కుప్పలుగా దర్శనం ఇస్తున్నాయి. వర్షం వస్తే చాలు తడిసి ముద్ద కావాల్సిందే. చేతికి వచ్చిన పంటను అమ్ముకోలేని దుర్భర స్థితిలో ఉండాల్సి దుస్ధితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్సీఐలో దిగుమతి కావాలంటే బస్తాకు రూ.8 రైతు చెల్లించాల్సిందే..
అంతేకాదు ప్రభుత్వం కొనుగోలు చేసిన దాన్యాన్ని టీఎస్ డబ్ల్యూసీకి వెళ్ళిన దాన్యం లారీలు దిగుమతి కావడంలేదు. నాలుగు రోజులు అవుతున్నా దిగుమతి కావడం లేదు. ముందే దిగుమతి ఖర్చు చెల్లిస్తే తప్ప దిగుమతి చేయమని హమాలీలు తేల్చి చెప్పడంతో నిర్వహకులు, రైతులు అయోమయంలో పడుతున్నారు. బస్తాకు రూ.8 చెల్లిస్తే తప్ప బస్తాను ముట్టుకోమని దౌర్జన్యంకు దిగుతున్నారు.
దీంతో నిర్వహకులు, లారీ డ్రైవర్లు, రైతులు సైతం రోజుల తరబడి తిండి తిప్పలు లేక గోదాం దగ్గరలో ఉన్న రోడ్లపాలు అవుతున్నారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయారు. కొనుగోలు కేంద్రాల్లో హామాలీలు కాంటాలు వేయడానికి క్వింటాకు సుమారు రూ.49 అలాగే దిగుమతి చేయడానికి క్వింటాకు రూ. 20 అంటే సుమారు రూ.70 ఖర్చు భరించాల్సిందే. దీంతో రైతులు నుంచి ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు వీచక తప్పవని పలువురు భావిస్తున్నారు.
కమీషన్ దేవుడెరుగు.. వర్షం వస్తే ముద్ద కావాల్సిందే..
అధికారుల జాడ లేక పోవడం.. దాన్యం రవాణ కావాలంటే లారీలు రాకపోవడంతో కొనుగోలు చేయలేక పోతున్నామని ఇప్పటికే కొనుగోలు చేసి రవాణా కాకపోవడంతో లారీల కొద్ది బస్తాలు కేంద్రంలో ఉన్నాయని నిర్వహకులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం వర్షం వస్తే చాలు కాంటాలు వేసిన బస్తాలు, రైతుల దాన్యం రాశులు ముద్దయై మొలకలు వచ్చే పరిస్థితి ఉందని, కమీషన్ దేవుడెరుగు తడిసిన బస్తాలు మిల్లర్లు దించుకోక పోతే నష్టం వాటిల్లక తప్పదని నిర్వహకులు తేల్చి చెబుతున్నారు.
వీడని మొద్దు నిద్ర.. అయోమయంలో రైతులు..
జిల్లా స్థాయి అధికారులు మొద్దు నిద్రలో ఉండడం.. ఏసీలకే పరిమితం కావడం..నిర్వహణలోపం.. కమీషన్లకు కక్కుర్తి మూలఁగా చర్యలు చేపట్టక పోవడంతో రైతు రాజుగా, దేశానికి వెన్నుముఖ లాంటి పదాలకు మాత్రమే పరిమితం కావడం నిజంగా రాజుగా కాలేక పోతున్నారని పలువురు రైతులు పెర్కోంటున్నారు.
అయితే అధికారుల మొద్దు నిద్రలో ఉండడంతోనే రైతులకు ఇలాంటి దుర్భర పరిస్థితి దాపురిస్తుందని ఇదంతా ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయని.. పాలన వైఫల్యం లాంటి నిందలు మోయక తప్పదని రైతులు, మేధావులు, యువత పెర్కోంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి రైతు దాన్యాన్ని ఎలాంటి కొరివీలు లేకుండా దాన్యం కొనుగోలు చేసి, లారీల కొరత లేకుండా చూడాలని, దిగుమతి ఖర్చు లేకుండ చూడాలని, రైతుల ఖాతాలో త్వరితగతిన డబ్బులు జమ చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
బాంచన్ కాళ్ళు మొక్కుతాం.. అధికారులు జర దయ చూపండి
ఈరోజైనా కాంటా అయితాయని ఇల్లు వాకిలి వదిలి రోజుల తరబడి ఇలా కాపాల కాస్తున్నాం. నాలాంటి రైతులెందరో ఇలా బాధపడుతునే ఉన్నాం. బాంచన్ కాళ్ళు మొక్కుతాం.. జర దయ చూపండి అని మొర పెట్టుకుందామంటే అధికారుల జాడ లేదు. కష్ట పడి పండించిన పంటకు గిట్టు బాటు ధర ఏమోగాని అమ్ముకోవాలంటే చుక్కలు కనుబడుతున్నాయి. హమాళీల ఖర్చుల లెక్కలు ధారుణం. దిగుమతి చేయాలన్నా ఖర్చు కట్టియడాన్ని ప్రశ్నించే ఎర్ర జెండాల నాయకులు ఎక్కడ. అడిగే నాధుడు లేరా.
రామిడి మాధవడ్డి, యువ రైతు