calender_icon.png 10 January, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణిపూర్‌లో కాల్పుల కలకలం

02-01-2025 03:13:53 AM

  1. బాంబు దాడులకు తెగబడిన ఉగ్రవాదులు 
  2.  ఇంపాల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు

ఇంపాల్, జనవరి 1: గతేడాది మే నుంచి మణిపూర్ రావణకాష్ఠంలా రగులుతూనే ఉంది. కుకీ, మైతి జాతుల మధ్య వైరం నిత్యం ఏదోఒక చోట ఉద్రిక్తతలకు ఉసిగొల్పుతున్నది. కొత్త ఏడాదిలోనైనా రాష్ట్రంలో శాంతినెల్పుతానని సీఎం బీరేన్ సింగ్ హామీ ఇచ్చి కొద్ది గంటలు  కాకముందే ఉగ్రమూకల దాడులు కలకలం రేపాయి.

ఇంఫాల్ జిల్లాలోని కదంగ్‌బండ్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు బాంబు దాడులు, కాల్పులకు పాల్పడ్డారు. వారి వద్ద అత్యాధునిక మారణాయుధాలున్నాయని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు భారీగా ఆ ప్రాంతాన్ని మోహరించాయి. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.

మరోవైపు భద్రతా బలగాలు బిష్ణుపూర్, తౌబల్ జిల్లాల్లో భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నాయి. డంప్‌లో 12 బోర్ సింగిల్ బ్యారెల్ గన్స్, రెండు 9 ఎంఎం పిస్టల్స్, నాలుగు హ్యాండ్ గ్రనేడ్‌లు, ఒక డిటోనేటర్‌తో పాటు ఇతర మందుగుండు సామగ్రి, మారణాయుధాలు లభించాయి.

మోదీ ఎందుకు మణిపూర్‌లో పర్యటించలేదు?: జైరాం రమేశ్

మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ వ్యాఖ్యలపై ఏఐసీసీ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్రిక్తలు నెలకొన్నప్పుడు ప్రధాని మోదీ రాష్ట్రంలో ఎందు కు పర్యటించడం లేదని, రాష్ట్రప్రజలకు ఎం దుకు భరోసా ఇవ్వడం లేదని నిలదీశారు. అక్కడ పర్యటించేందుకు అవకాశం ఉన్నప్పటికీ మోదీ కావాలనే పర్యటనకు పూనుకోవడం లేదని విమర్శించారు. 

కాంగ్రెస్ పాపాల వల్లే ఉద్రిక్తత: సీఎం బీరేన్‌సింగ్

రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులన్నింటికీ కారణం కాంగ్రెస్ పార్టీనే అని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతోనే రాష్ట్రంలో ఉద్రిక్తలు చోటుచేసుకుం టున్నాయని అన్నారు. బర్మా శరణార్థులకు పదే పదే ఆశ్రయం కల్పించడం, మయన్మార్ మిలిటెంట్లతో ఎస్‌ఓఓ ఒప్పందం చేసుకున్నారని, నాటి కేంద్ర మంత్రి చిదంబరం దగ్గరుండి మరీ ఆ పనులన్నింటినీ చక్కబెట్టారని  గుర్తుచేశారు.