21-02-2025 12:00:00 AM
జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో ప్రకటించిన చిత్రం ఎట్టకేలకు పట్టాలెక్కింది. ‘ఎన్టీఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో గత ఏడాది పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ పాన్ ఇండియా చిత్రం 2026 సంక్రాంతికి విడుదల చేస్తామని ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయటంతో అటు అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురుచూశారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చేసింది.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ గురువారం రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. 3 వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణతో షూటింగ్‌ను ప్రారంభించారు. ఎన్టీఆర్ వచ్చే షెడ్యూల్ నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పటివరకు తారక్‌ను ఎన్నడూ చూడని మాస్ అవతార్‌లో ఈ సినిమాలో చూపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
కళ్యాణ్‌రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రానికి నిర్మాతలు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 2026, జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుందీ చిత్రం.