calender_icon.png 7 March, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీకి లక్ష చొప్పున ట్రిప్పుకు రూ.13లక్షలు

06-03-2025 11:42:08 PM

గత ఏడాది 30 సార్లు దుబాయ్ పర్యటన..

రన్యారావు కేసులో విస్తుపోయే విషయాలు..

బెంగళూరు: బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు గత ఏడాదిలో దాదాపు 30సార్లు దుబాయ్‌కు వెళ్లినట్టు తెలుస్తుంది. కేజీ బంగారానికి రూ.1లక్ష చొప్పున ఒక్క ట్రిప్పుకు సుమారు రూ.12 వసూలు చేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. భద్రతా సిబ్బందికి అనుమానం రాకుండా పెద్ద మొత్తంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి రన్యారావు ప్రత్యేకంగా తయారైన జాకెట్ ఉపయోగించడంతో పాటు నడుము బెల్టును ఉపయోగించినట్టు అధికారులు తమ విచారణలో తెలుసుకున్నారు.

ఎయిర్‌పోర్టులో జరిపే భద్రతా తనిఖీల నుంచి బయటపడేసేందుకు ఆమెకు ఓ కానిస్టేబుల్ సాయం చేసినట్టు పోలీసులు గుర్తించారు. గత కొన్ని వారాలుగా రన్యారావు పదేపదే దుబాయ్‌కు వెళ్తుండటంతో అమెపై నిఘా పెట్టిన పోలీసులు.. సుమారు రూ.12.56కోట్ల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో సోదాలు జరిపి మొత్తం 17.29కోట్లను అధికారులు సీజ్ చేశారు. కాగా రన్యారావుకు వెనక పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పోలీసు అధికారుల హస్తం ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 

పిన తండ్రిపైనా గతంలో ఆరోపణలు

రన్యారావు అరెస్ట్‌పై ఆమె పిన తండ్రి రామచంద్రరావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. అలాగే తన వృత్తి జీవితంలో ఎటువంటి అవినీతి మరకలు లేవని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం డీజీపీ హోదాలో పని చేస్తున్న ఆయన.. గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2014లో దక్షిణ మైసూర్ పరిధిలో ఐజీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో పెద్ద హవాలా కుంభకోణంలో చిక్కుకున్నారు.

బస్సులో తరలిస్తున్న రూ.2.07 కోట్ల డబ్బును హవాలా డబ్బుగా పేర్కొంటూ రామచంద్రరావు నేతృత్వంలోని బృందం సీజ్ చేసింది. అయితే అందులో కేవలం రూ.20లక్షలను మాత్రమే సీజ్ చేసినట్టు రికార్డుల్లో పేర్కొన్నారు. డబ్బుకు సంబంధించిన వ్యాపారి తన రూ2.07కోట్లను పోలీసులు దోచుకున్నారని ఫిర్యాదు చేయడంతో రామచంద్రరావుపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ కేసులో ఆయన గన్‌మెన్ అరెస్ట్ అయ్యారు. అలాగే 2018లో ఫేక్ ఎన్‌కౌంటర్ల కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు.