calender_icon.png 17 November, 2024 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినేశ్ ఫొగాట్‌కు షాక్

15-08-2024 12:00:00 AM

రజత పతకం అప్పీల్‌ను తిరస్కరించిన కాస్

పారిస్: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు షాక్ తగిలింది. ఒలింపిక్స్ పోటీల్లో రెజ్లింగ్‌లో తనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ వినేశ్ పెట్టుకున్న అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) తిరస్కరించింది. వినేశ్ అప్పీల్‌ను కొట్టివేస్తూ బుధవారం కాస్ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం వినేశ్  కేసు తీర్పు వెలువడాల్సి ఉన్న నేపథ్యంలో అప్పీల్‌ను తిరస్కరిస్తూ కాస్ తీసుకున్న నిర్ణయం భారతావనిని షాక్‌కు గురి చేసింది. తీర్పు వినేశ్‌కు అనుకూలంగా వస్తుందని ఆశించినప్పటికీ నిరాశే ఎదురైంది. ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల ఫ్రీస్టుల్ విభాగంలో బరిలోకి దిగిన వినేశ్ వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చింది.

అయితే ఫైనల్‌కు ముందు కేవలం వంద గ్రాముల అధిక బరువు వినేశ్‌పై అనర్హత వేటు పడేలా చేసింది. అనర్హత వేటును సవాల్ చేస్తూ వినేశ్ కాస్‌లో పిటిషన్ వేసింది. కనీసం రజత పతకమైనా ఇవ్వాలని అప్పీల్‌లో పేర్కొంది. ఇప్పటికే రెండుసార్లు తీర్పును వాయిదా వేసిన కాస్ బుధవారం వినేశ్ అప్పీల్‌ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ‘కాస్ నిర్ణయం షాక్‌కు గురి చేసింది. వినేశ్‌కు కచ్చితంగా పతకం వస్తుందని ఆశించాం. అప్పీల్‌ను తిరస్కరించడం బాధాకరం’ అని భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష పేర్కొంది.